ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Union Law Minister On Cat Bench: 'విశాఖలో క్యాట్ బెంచ్ ప్రతిపాదన లేదు' - విశాఖ క్యాట్ బెంచ్ వార్తలు

union law minister on cat bench: విశాఖపట్నంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) బెంచ్ ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్​సభకు తెలిపారు. వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

union minister on cat bench in vizag
union minister on cat bench in vizag

By

Published : Dec 18, 2021, 6:57 AM IST

union law minister on cat bench: విశాఖపట్నంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) బెంచ్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రీజిజు లోక్‌సభకు తెలిపారు. వైకాపా సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీధర్‌ కోటగిరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజనకు ముందు కక్షిదారులు తమ ఉద్యోగ సేవల్లో వచ్చే సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో ఉండే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేవారని, రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ ట్రైబ్యునల్‌ న్యాయ పరిధిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు రెండింటికీ విస్తరింపజేస్తూ 2014 సెప్టెంబర్‌ 3న నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు వెల్లడించారు. ఎస్పీ సంపత్‌కుమార్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 1986 డిసెంబర్‌ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హైకోర్టు ధర్మాసనం ఉన్నచోట ప్రభుత్వం క్యాట్‌ శాశ్వత బెంచ్‌ను ఏర్పాటు చేయొచ్చన్న న్యాయ శాఖ మంత్రి.. పని పరిమాణం దృష్ట్యా ఒకవేళ అది సాధ్యం కాకపోతే కనీసం క్యాట్‌ సర్క్యూట్‌ బెంచ్‌నైనా ఏర్పాటు చేయడానికి వీలుందన్నారు. అయితే ఇలా సర్క్యూట్‌ బెంచ్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకొనే అధికారం క్యాట్‌ రూల్స్‌-1985లోని 3వ నిబంధన ప్రకారం దాని ఛైర్మన్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకైతే విశాఖపట్నంలో దీని బెంచ్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదు అని కిరెన్‌ రిజిజు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 2,21,788 కేసులు పెండింగ్‌..

దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో 56,40,641 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు బదులు ఇచ్చారు. అన్ని హైకోర్టుల్లో 40,81,024 సివిల్ కేసులు.. 15,59,617 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సమాధానంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా అలహాబాద్ హైకోర్టులో 8,01,013 కేసులు పెండింగ్‌లో ఉంటే.. అత్యంత తక్కువగా.. సిక్కిం హైకోర్టులో 188 కేసులు ఉన్నాయని వివరించింది. అలహాబాద్ హైకోర్టులో 4,17,768 సివిల్ కేసులు... 3,83,245 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ తెలిపింది. తెలంగాణ హైకోర్టులో సివిల్‌ కేసులు 2,18,659 ఉండగా... 35,464 క్రిమినల్‌, మొత్తం 2,54,123 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి సమాధానంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 1,88,963 సివిల్‌ కేసులు ఉంటే... 32,825 క్రిమినల్‌ కేసులు, మొత్తం 2,21,788 కేసులు పెండింగ్‌ ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

దేవాల‌య షాపుల వేలంలో.. అన్ని మతాలవారూ పాల్గొన‌వ‌చ్చు: సుప్రీం కోర్టు

ABOUT THE AUTHOR

...view details