ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిశ్రమను అమ్మే హక్కు కేంద్రానికి లేదు: కార్మిక సంఘాలు - ఉక్కు పరిరక్షణ సమితి తాజా వార్తలు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన 'ఉక్కు కార్మిక గర్జన' బహిరంగ సభ.. విశాఖపట్నంలోని తృష్ణ మైదానంలో ప్రారంభమైంది. ఉక్కు పరిశ్రమను అమ్మే హక్కు కేంద్రానికి లేదని కార్మిక సంఘం నేతలు స్పష్టం చేశారు. పరిశ్రమలు ప్రైవేటు పరమైతే కార్మిక చట్టాలు కనుమరుగు కావటం ఖాయమన్నారు. విశాఖ ఉక్కు పోరాటానికి దేశవ్యాప్త మద్దతు ఉందని చెప్పారు.

ఉక్కు కార్మిక గర్జన
ఉక్కు కార్మిక గర్జన

By

Published : Mar 20, 2021, 7:38 PM IST

Updated : Mar 21, 2021, 7:37 AM IST

పిడికిళ్లు బిగిశాయి.. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామంటే.. సహించేదే లేదని గర్జించాయి. పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఉక్కు కర్మాగారం ప్రాంగణంలోని త్రిష్ణా గ్రౌండ్స్‌లో జరిగిన సమావేశానికి కార్మికులు, ఉద్యోగులు, వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఒక్క విశాఖ ఉక్కే కాదు.. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థల విక్రయానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రాణాలొడ్డి అడ్డుకుంటామని ముక్తకంఠంతో స్పష్టం చేశారు. బడా పెట్టుబడిదారులను కర్మాగారం వైపునకు కూడా రానిచ్చేది లేదని హెచ్చరించారు. విశాఖ ఉక్కు పోరాటానికి దేశవ్యాప్త మద్దతు ఉందని స్పష్టం చేశారు.

వేదికపై అభివాదం చేస్తున్న నేతలు

మోదీ ఆలోచన ప్రజల కోసమా.. పెట్టుబడిదారుల కోసమా?

ప్రధాని మోదీ ఆలోచన ప్రజల కోసమా..? పెట్టుబడిదారుల కోసమా? అని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ ప్రశ్నించారు. ఇప్పటికీ 8 వేల మంది స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితులకు ఉపాధి లేదన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితుల పరిస్థితి ఏమిటో మోదీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

దేశాన్నీ అమ్మేస్తారేమో

ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తున్న ప్రధానమంత్రి మోదీ ఏదో ఒకరోజు దేశాన్నీ అమ్మేస్తారేమోనని అనుమానం కలుగుతోందని ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి ఆరోపించారు. సభకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ప్రసంగించారు. ప్రభుత్వరంగ సంస్థలు అందించే రిజర్వేషన్లను కాలరాయడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు రద్దవుతాయని ఆయన ధ్వజమెత్తారు. బ్యాంకులు, బొగ్గుగనులు, రైల్వేలు, బీమా సంస్థలు, అన్నింటినీ మోదీ ప్రైవేటీకరిస్తానంటున్నారని ధ్వజమెత్తారు.

సభలో మాట్లాడుతున్న ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి

ప్రజా ఉద్యమాలుగా మారాలి
ప్రభుత్వరంగ సంస్థల విక్రయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్మిక, ఉద్యోగ ఉద్యమాలు ప్రజా ఉద్యమాలుగా మారాలని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ పిలుపునిచ్చారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. పలు ప్రైవేటు సంస్థలకు ఇనుప ఖనిజం కేటాయించిన ప్రభుత్వాలు.. విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు ఎందుకు కేటాయించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు జాతీయ సంపదలని, వాటిని లూటీ చేస్తామంటే అనుమతించేది లేదన్నారు. సేలం కర్మాగారాన్ని చూసేందుకు వచ్చిన ప్రతినిధులను విమానాశ్రయం వరకు తరిమికొట్టి.. మరోసారి వస్తే ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేమని కార్మికులు హెచ్చరించి పంపి వీరోచితంగా పోరాడారని వివరించారు. ప్రైవేటు సంస్థలు చేసిన రూ.లక్షల కోట్ల రుణాల్ని రద్దుచేసి దేశ ఖజానాను లూటీ చేస్తున్నారని ఆరోపించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంటే దేశాన్ని కొల్లగొట్టటమేనని తపన్​సేన్ స్పష్టం చేశారు. ఉక్కు కార్మికుల ఉద్యమానికి నైతిక మద్దతు సరిపోదన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు జాతీయ స్థాయిలో ప్రత్యక్ష పోరాటం చేయాలని చెప్పారు. దేశంలోని ఉక్కు పరిశ్రమల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కే సొంత గనుల్లేవన్న ఆయన.. కేంద్రం నుంచి రూపాయి కూడా స్టీల్‌ప్లాంట్‌ తీసుకోవడం లేదని గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉందని ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. స్థూల జాతీయోత్పత్తి బాగా లేనప్పుడు పరిశ్రమలు లాభం సాధిస్తాయా? అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఏ ఉక్కు పరిశ్రమకైనా గతేడాది లాభాలు వచ్చాయా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కొన్ని నెలలుగా విశాఖ ప్లాంట్‌ మాత్రమే లాభాలు సాధిస్తోందని గుర్తు చేశారు.

సభలో మాట్లాడుతున్న సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌

భూముల విలువ రూ.56 కోట్లేనా?
దేశ సంపదను కాపాడేవాళ్లను దేశభక్తులు అంటారని.. విక్రయించేవాళ్లను ఏమంటారని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ ప్రశ్నించారు. ఉక్కు కర్మాగార భూముల విలువ రూ.2లక్షల కోట్లు ఉంటుందని చెబుతున్నారని, వాటి అధికారిక విలువను మాత్రం రూ.56 కోట్లుగానే చూపుతున్నారని దుయ్యబట్టారు. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టే దొంగలకు ప్రభుత్వరంగ సంస్థలను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. బీఎంఎస్‌ జాతీయ కార్యదర్శి డి.కె.పాంథే మాట్లాడుతూ.. తమది భాజపా అనుబంధ కార్మిక సంస్థ అయినా కార్మికుల సంక్షేమం కోసమే పని చేస్తామన్నారు. దేశంలోని కార్మికులంతా ఒక్కటేనని గుర్తుచేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను బీఎంఎస్‌ వ్యతిరేకిస్తోందని తెలిపారు. హెచ్‌ఎంఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రియాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ దేశంలో దొంగలు పడ్డారని ఆరోపించారు. విశాఖ ఉక్కును ఎందుకు.. ఎంతకు.. ఎవరికి అమ్ముతున్నారో చెప్పాలన్నారు. తెలంగాణలోని సింగరేణి కార్మికులు కూడా విశాఖ ఉక్కుకు మద్దతుగా నిలుస్తున్నారని, విశాఖ ఉక్కు కోసం నిరసనలు కూడా చేస్తున్నామని, కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తెరాస కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ భాజపా ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్ముకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం పీఎస్‌యూలకు కొనుగోలు ఆర్డర్లు ఇచ్చి సహకరిస్తోందని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతుగా నిలిచారని, వివిధ ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారని పేర్కొన్నారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ అన్ని కార్మికసంఘాల నాయకుల్ని ప్రధాని దగ్గరకు తీసుకెళ్లాలని సూచించారు. లేదంటే ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆ బాధ్యతను తాను నిర్వర్తిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

జగన్‌ను చూసి మోదీ బుద్ధి తెచ్చుకోవాలి
సీఎం జగన్‌ను చూసి ప్రధాని మోదీ బుద్ధి తెచ్చుకోవాలని వైకాపా కార్మికసంఘ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ఎద్దేవా చేశారు. మోదీ కార్మికవర్గంపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. కార్మికుల జోలికి వస్తే తస్మాత్‌ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు తీసుకుంటే సంస్థ లాభాల్లోకి వస్తుందని వివరించారు. ఏ విదేశీయుడినీ కర్మాగారంలోకి అడుగుపెట్టనీబోయమని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు విశాఖ ఉక్కుకు వస్తే తరిమికొట్టాలని, వారికి అండగా వైఎస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విశాఖ ఉక్కు కర్మాగార ఉద్యోగులు, కార్మికులతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు.

ఉక్కు గర్జనలో కార్మిక సంఘం నేతలు

ఇదీ చదవండి:

ఉక్కు ఉద్యమంలో లేఖ కలకలం..ఆత్మహత్య చేసుకుంటానన్న ఉద్యోగి

Last Updated : Mar 21, 2021, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details