ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‘సిట్‌’ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ - విశాఖపట్నం జిల్లా వార్తలు

విశాఖలో భూ అక్రమాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) నివేదిక... తుది దశకు చేరుకుంది. అక్రమార్కులతో పాటు వాటితో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిలో గుబులు రేపుతోంది. ఇప్పటికే కొన్ని అక్రమాలను గుర్తించి బాధ్యులెవరనే విషయమై సిట్‌ బృందం స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.

Ubiquitous suspense over ‘sit‌’ report
‘సిట్‌’ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ

By

Published : Dec 2, 2020, 11:23 AM IST

విశాఖలో భూ అక్రమాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) నివేదిక తుది దశకు చేరుకుంది. అక్రమార్కులతో పాటు వాటితో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిలో గుబులు రేపుతోంది. ఇప్పటికే కొన్ని అక్రమాలను గుర్తించి బాధ్యులెవరనే విషయమై సిట్‌ బృందం స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా అంశాలనే నివేదికలో ప్రధానంగా ప్రస్తావిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయాలని నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణలో సైతం.. తప్పిదాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరానికి చెందిన పౌరులు సూచించారు. వీటినీ పరిగణనలోకి తీసుకొని తగు సూచనలు చేయనున్నారు.

ఈ అంశాలూ పరిగణనలోకి...

గత సిట్‌ నివేదికను క్షుణ్ణంగా పరిశీలన చేసిన బృందం నాటి నివేదికలో పొందపర్చిన అంశాలు, సిఫార్సులను సైతం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితుల పేరుతో కేటాయించిన భూములకు సంబంధించి నగరానికి ఆనుకొని ఉన్న పది మండలాల పరిధిలో 66 మందికి ఎన్‌వోసీ (నిరభ్యంతర పత్రాలు)లు జారీ చేశారు. దాదాపు 350 ఎకరాలు ఆయా వ్యక్తుల పేరుతో కేటాయించారు. ఇప్పుడు ఆ భూములన్నీ చేతులు మారాయి. 2017లో ఐపీఎస్‌ అధికారి వినీత్‌బ్రిజ్‌లాల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్‌ మొత్తం 46 ఎన్‌వోసీల జారీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని నిర్ధారించింది. దీనికి బాధ్యులుగా అప్పట్లో విశాఖ జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లను గుర్తించి వారికి ప్రశ్నావళి పంపి వారి నుంచి సమాధానాలను సైతం రాబట్టింది. వీరితో పాటు 100 మంది వరకు ఆర్డీఓలు, డీఆర్వోలు, తహసిల్దార్లు, డీటీలు, ఇతర సిబ్బందితో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు, సర్వేయర్ల ప్రమేయాన్ని గుర్తించి వారి నుంచి సైతం వివరాలను రాబట్టారు. ఇలా గుర్తించిన వారిలో కొంతమంది పదవీ విరమణ చేశారు. మరికొందరు కీలక పోస్టుల్లో రాష్ట్రంలో సేవలందిస్తున్నారు. వీరి విషయంలో ప్రస్తుత సిట్‌ ఏం చేసిందనే విషయమై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఎన్‌వోసీ దస్త్రాలను మాత్రం క్షుణ్ణంగా పరిశీలన చేశారు.

రాజకీయ నేతల్లో ఆసక్తి

కొన్ని ఎన్‌వోసీలకు తగిన దస్త్రాలు సైతం లేవు. కొన్నింటికి మాత్రం ప్రభుత్వమే నేరుగా ఎన్‌వోసీలు జారీ చేసింది. వీటికి రికార్డులు పక్కాగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా పరవాడ, విశాఖ రూరల్‌ మండల పరిధిలో జారీ అయిన ఎన్‌వోసీల్లో నాడు అక్రమాలను గుర్తించారు. ఇప్పుడు సైతం ఆయా దస్త్రాలను నిశితంగా పరిశీలించిన సిట్‌ బృందం కొన్నింటికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిందా? లేదా అనే చర్చ సాగుతోంది. నివేదిక ఇంకా తుది దశలో ఉన్నందున అందులో ఏముందో చెప్పలేమని అధికార వర్గాలు చెబుతున్నా.. ఎన్‌వోసీలతో సంబంధం ఉన్న రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు నివేదికపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన ప్రముఖ రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు గత సిట్‌ తేల్చింది. ఈసారి ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయోననే ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి:

నూతన ఇసుక విధానంపై తెదేపా నిరసన ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details