విశాఖ ఆర్.కే.బీచ్లో ఆదివారం గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కె.శివకుమార్, మహమ్మద్ అజీజ్ మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. తెల్లవారుజాము నుంచి కె.శివకుమార్, మహమ్మద్ అజీజ్ ఆచూకీ కోసం మెరైన్, నేవీ బృందాలు బోటు, హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం కె.శివకుమార్ మృతదేహం లభ్యం కాగా.. సాయంత్రానికి మహమ్మద్ అజీజ్ మృతదేహాన్ని సహాయక బృందాలు కనుగొన్నాయి.
ఘటన జరిగిన తీరు..
హైదరాబాద్ బేగంపేటకు సమీపంలోని రసూల్‌పురకు చెందిన ఎనిమిది మంది విద్యార్థుల బృందం విశాఖలో నూతన సంవత్సర వేడుకలు చూద్దామని డిసెంబరు 31న వచ్చారు. స్థానికంగా ఒక లాడ్జిలో దిగారు. రెండ్రోజులు నగరంలోనే ఉన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు లాడ్జిని ఖాళీ చేశారు. సాయంత్రానికి హైదరాబాద్ తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.