విశాఖపట్నంలో రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. తెల్లవారుజామున 5.30 గంటలకే బృందాలుగా బయల్దేరి.. నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు. సుమారు 100 మంది పోలీసులు భూములు స్వాధీనం చేసుకునే ప్రాంతాలకు ముందుగానే చేరుకుని పహరా కాశారు. ఆర్డీవో పెంచల కిశోర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది జేసీబీలు, ఇతర సామగ్రితో మొదట తుంగ్లాం చేరుకున్నారు. అక్కడ సర్వే నంబరు 14లోని భూముల స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా నోటీసులు ఇవ్వకుండా ఎలా వస్తారంటూ స్థల యజమాని, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావు ప్రశ్నించారు. అది ప్రభుత్వ భూమి అని.. దానికి నోటీసులు ఇవ్వనవసరం లేదని అధికారులు చెప్పి.. అక్కడున్న ప్రహరీలను కూలగొట్టారు. కొంతసేపు ఇరువర్గాల మధ్య చిన్నపాటి వాదులాట చోటుచేసుకుంది.
దే సమయంలో జగ్గరాజుపేట, కూర్మన్నపాలెం, గాజువాక, తుంగ్లాంలోని ఇతర ప్రాంతాల్లోని ఆక్రమణలను నాలుగు జేసీబీలతో తొలగించారు. ఇక్కడున్న స్థలాల్లో కొన్నిచోట్ల ఐరన్ షీట్లు, ఫెన్సింగ్ తీగలు ఉంటే వాటన్నింటినీ రెవెన్యూ యంత్రాంగం తొలగించింది. రెండు, మూడు చోట్ల ప్రహరీలను కూలగొట్టారు. గాజువాక, పెదగంట్యాడ, ఆనందపురం మండల రెవెన్యూ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో ఉన్న షెడ్లు, కంచెలను తొలగించారు. అనంతరం తహశీల్దార్లు లోకేశ్వరరావు, వేణుగోపాలరావు తమ సిబ్బందితో 15 చోట్ల హెచ్చరిక బోర్డులు పాతారు. అంతేకాకుండా చెరువుకు వెళ్లే దారిలో రహదారి నుంచి పలుచోట్ల కందకాలు తవ్వి రాకపోకలు జరగకుండా చేశారు. ఆదివారం తాము స్వాధీనం చేసుకున్న మొత్తం భూములు 49.5 ఎకరాలని, వాటి బహిరంగ మార్కెట్ విలువ రూ.791.41 కోట్లని అధికారులు తెలిపారు. ఇందులో వివిధ మండలాలకు చెందిన సుమారు 40 మంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ భూములు వివిధ ప్రాంతాల్లో ఉండటంతో వీటి స్వాధీనానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టింది.
స్వాధీనం చేసుకున్నది ఆక్రమిత భూమే: అధికారులు
గాజువాక మండలం జగ్గరాజుపేట, తుంగ్లాం ప్రాంతాల్లోని వివిధ సర్వే నంబర్లలో 20 చోట్ల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే, తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావుతో పేరుతో ఉన్న భూములతో పాటు, వాటిని ఆనుకొని ఉన్న మరికొన్నింటిని ఆధీనంలోకి తీసుకున్నామన్నారు.
* తుంగ్లాం గ్రామం సర్వే నంబరు 28లో చెరువును ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. 21.67 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఒక్క ప్రాంతం బహిరంగ మార్కెట్ విలువే రూ.377 కోట్లుగా అంచనా వేశారు. అదే ప్రాంతంలోని సర్వే నంబరు 12-1 నుంచి 14 వరకు 6.15 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోగా దాని మార్కెట్‌విలువ రూ.107 కోట్లుగా నిర్ధరించారు.
* జగ్గురాజుపేట సర్వే నంబరు 14-1ఏలో 8.33 ఎకరాలు, ఇదే ప్రాంతం సర్వే సంఖ్య 14-1సిలో 1.01 ఎకరాలు, 14-2లో 1.11 ఎకరాల ఈనాం భూములను స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడింటి మార్కెట్ విలువ రూ.110 కోట్లు. తుంగ్లాం సర్వే నంబరు 29-1బిలో 70 సెంట్లు స్వాధీనం చేసుకోగా దీని మార్కెట్ రూ.12 కోట్లు.
* జగ్గురాజుపేటలో సర్వే నంబరు 28-1లో 0.53 , 28-2లో 0.73 ఎకరాల్లో ఉన్న వాగుల్లోని ఆక్రమణలు తొలగించారు. తుంగ్లాం సర్వే నంబరు 14-1లో 1.85 ఎకరాల చెరువును స్వాధీనం చేసుకోగా దాని మార్కెట్ విలువ రూ.32 కోట్లు. ఇదే ప్రాంతం సర్వే సంఖ్య 33-2లో 1.37 ఎకరాల్లో ఉన్న బందను ఆధీనంలోకి తీసుకోగా దీని మార్కెట్ విలువ రూ.24 కోట్లుగా అంచనా వేశారు.
* కూర్మన్నపాలెం సర్వే సంఖ్య 8-6లో రూ.43 కోట్ల విలువ చేసే 1.35 ఎకరాల గయాల స్థలం, తుంగ్లాంలో సర్వే నంబరు 30-12లో 1.10 ఎకరాలు, 30-13లో 0.27, 30-15లో 0.64 ఎకరాల గయాల భూములను స్వాధీనం చేసుకోగా వీటి మార్కెట్ విలువ రూ.30 కోట్లు.
* గాజువాకలో కొండపోరంబోకు స్థలం, తుంగ్లాంలో ఆక్రమణలోని మరికొన్ని ప్రభుత్వ పోరంబోకు స్థలాలను స్వాధీనం చేసుకున్నారు.