కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రజల్లో మానవత్వం పరిమళిస్తోంది. ఉన్న దాంట్లో మరొకరికి సాయం చేసే గొప్ప గుణం పెరుగుతోంది. అలాంటి సంఘటనే విశాఖ కంచరపాలెం ప్రాంతంలో కనిపించింది. ట్రాన్స్ జెండర్.. పేరు మల్లిక.. పరిస్థితులు సహకరించక రోడ్లపైన, దుకాణాల వద్ద తిరుగుతూ.. వారు ఇచ్చిన డబ్బులతోనే పొట్టనింపుకొనేది. లాక్డౌన్ వేళ తన చుట్టూ ఉండే వారు ఆకలితో అలమటిస్తుండటం చూసి.. మల్లిక చలించిపోయింది.
గతంలో తన ఆకలి తీర్చిన వారి రుణం తీర్చుకోవాలనుకుంది. తాను దాచుకున్న సొమ్ముతో ప్రతిరోజు సుమారు 200 మందికి భోజనాన్ని వండి వడ్డిస్తోంది. ఆ విషయం తెలుసుకున్న కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు మల్లిక చేస్తున్న సేవకు చేదోడుగా నిలిచి వంటకు కావాల్సిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారు.
లాక్ డౌన్ తో పేదలు, కూలీల బతుకు భారంగా మారింది. కంచరపాలెం రైల్వే గేటు పట్టాల పక్కన బ్రిడ్జి కింద నివాసం ఉంటున్న వారి జీవితం దుర్భరమైంది. వీళ్లంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. ఈ కష్ట కాలంలో వాళ్ల కడుపు నింపుతోంది ట్రాన్స్ జెండర్ మల్లిక. లాక్ డౌన్ మొదలైన రెండో రోజు నుంచే ఆమె పేదలకు, కూలీలకు భోజనాలు అందించడం ప్రారంభించింది.