ఒక వైపు కుమార్తె వివాహం వైభవంగా జరుగుతోంది. బంధువులంతా సందడి వాతావరణంలో వేడుకను చూస్తున్నారు. తీరా చూస్తే ఇంట్లో పెళ్లి కూతురు తల్లిదండ్రులు విగతజీవులై కనిపించారు. దీంతో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన విశాఖలో జరిగింది.
విశాఖలోని భానునగర్‌కు చెందిన దంపతులు.. పోర్టు విశ్రాంత ఉద్యోగి వి. జగన్నాధరావు(63), విజయలక్ష్మీ(57). జగన్నాధరావు రెండో కుమార్తె భారతి వివాహం మద్దిలపాలెం హెచ్‌బీ కాలనీలోని ఓ ఫంక్షన్ హాలులో బుధవారం రాత్రి 2.30 గంటలకు జరగనుంది. ఈ మేరకు కల్యాణ మండపంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడే ఉన్న జగన్నాధరావు, విజయలక్ష్మీ దంపతులు.. బంధువులను ఆహ్వానించారు. అందరితో మాట్లాడారు.
అంతలో..
ఓ వైపు వివాహం జరుగుతుండగా.. ఎవరికీ చెప్పకుండా దంపతులిద్దరూ ఫంక్షన్ హాలు నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కన్యాదానం జరిగే సమయానికి వధువు తల్లిదండ్రుల కోసం పురోహితులు ఆరా తీయగా.. వారిద్దరూ అక్కడ లేనట్లుగా బంధువులు గుర్తించారు. దీంతో వాళ్లను వెతుకుతూ.. భానునగర్‌లోని ఇంటికి వెళ్లిన బంధువులు షాక్‌కు గురయ్యారు. జగన్నాధరావు ప్యాన్ సీలింగ్‌కు వేలాడుతూ కనిపించగా.. విజయలక్ష్మి మంచంపై పడి ఉంది. అతన్ని కిందకు దించి పరిశీలించిన వాళ్లు.. ఇద్దరూ చనిపోయినట్లు గుర్తించారు. భార్యాభర్తలిద్దరి మృతితో పెళ్లి ఇంట విషాదం అలముకుంది. బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. జగన్నాధరావు బంధువు ఫిర్యాదు మేరకు ఎంవీపీ సీఐ. రమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
వాళ్ల మృతికి ఆదే కారణమా..?
విజయలక్ష్మి కొంతకాలంగా మానసికపరమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమె అనారోగ్యంతో బాధపడుతూ.. అందరితో తరుచూ గొడవలు పడేదని.. పెళ్లి జరుగుతున్న సమయంలో కూడా భర్తతో గొడవ పడిందని తెలిపారు. దీంతో విసిగిపోయిన జగన్నాధరావు.. భార్యను ఇంటికి తీసుకెళ్లి.. పెళ్లి జరుగుతుండగా ఆమెను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణయ్య తెలిపారు.
ఇదీ చదవండి..
బావిలో పడి ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులు మృతి