రాష్ట్రంలోని తూర్పు మన్యం ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యటకుల తాకిడి సైతం ఆయా ప్రాంతాలకు పెరుగుతోంది. ప్రధానంగా.. లంబసింగిలో పర్యటకుల సందడి ఎక్కువగా ఉంది. దట్టమైన మంచు కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది.
ఆంధ్రా కాశ్మీర్‌కు పెరిగిన పర్యాటకుల తాకిడి..
ఆంధ్రా కాశ్మీర్‌గా పేరుపొందిన ప్రముఖ పర్యాటక కేంద్రం విశాఖ మన్యం పరిధిలోని లంబసింగికి పర్యటకుల వాహనాలు అధిక సంఖ్యలో చేరుకుంటున్నాయి. వారం రోజులుగా లంబసింగి ప్రాంతంలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు అందాలు చూసేందుకు పర్యటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈనెల 25 క్రిస్మస్ నుంచి 27 వరకు సెలవు రోజులు కావడంతో సందర్శకుల తాకిడి మరింతగా పెరిగింది. విశాఖ, అనకాపల్లి, ఉభయగోదావరి, విజయనగరం తదితర ప్రాంతాలకు చెందిన పర్యటకులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే లంబసింగికి చేరుకున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోపక్క విపరీతమైన చలి ఉండడంతో వాహనాల్లో నుంచి బయటకు రావడానికి పర్యటకులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కారణంగా.. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి చింతపల్లి, సీలేరు, గూడెంకొత్తవీధి తదితర ప్రాంతాలకు రోజూ తెల్లవారుజామున సరఫరా చేసే నిత్యవసర సరుకుల వాహనాలు నిలిచిపోతున్నాయి. వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.