ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...! - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ

విశాఖను విషగాలి సృష్టించిన విలయంతో.... ఎల్జీ పాలిమర్స్‌ పరిసర ప్రాంత వాసులు ఉలిక్కిపడుతూనే ఉన్నారు. బాధితుల్లో కొందరికి ఒంటి మీద బొబ్బలు వస్తున్నాయి. పిల్లల్లో న్యూమోనియా లక్షణాలు బయటపడ్డాయి. స్టైరీన్ లీకేజ్ దేశంలోనే తొలిసారి. ట్యాంక్ పేలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని నిపుణులు తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Toxic problems that haunt the Vishakha residents
విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు

By

Published : May 9, 2020, 7:07 AM IST

Updated : May 9, 2020, 9:35 AM IST

వాయు విషాదం వెంటాడుతూనే ఉంది. విషవాయువు సృష్టించిన విలయంతో విశాఖ శివార్లలోని పలు ప్రాంతాల వాసులు ఇప్పటికీ ఉలిక్కిపడుతూనే ఉన్నారు. గురువారం తెల్లవారుజామున ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన ఘోర ప్రమాదం తాలూకు భయోత్పాతం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. బాధితుల్లో కొందరికి క్రమేపీ ఒంటి మీద బొబ్బలు వస్తున్నాయి. ఈ ప్రమాదం కారణంగా అస్వస్థతకు గురైన 554 మందిలో 52 మంది చిన్నారులే ఉండటం కలచివేస్తోంది. పిల్లల్లో కొందరికి జ్వరం, న్యుమోనియా లక్షణాలు బయటపడుతున్నాయి.

ట్యాంక్ పేలి ఉంటే ...పెను ప్రమాదమే

విశాఖలోనే ఉండి సహాయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం వీడియో సమీక్ష నిర్వహించారు. మరోవైపు గుజరాత్‌ నుంచి వచ్చిన నిపుణులు లీకేజీని అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. స్టైరీన్‌ ఆవిర్లను గడ్డ కట్టించడమే లక్ష్యంగా.. 150 డిగ్రీల నుంచి.. ఉష్ణోగ్రతను 120 డిగ్రీలకు తగ్గించగలిగారు. ఈ తరహా స్టైరీన్‌ లీకేజి దేశంలోనే ఎప్పుడూ జరగలేదంటున్నారు. స్టైరీన్‌ ట్యాంకు సేఫ్టీ వాల్వు తెరుచుకోవటంతో భారీ ప్రమాదం తప్పిందని, లేకుంటే ట్యాంకే పేలి.. పెను ప్రమాదం సంభవించేదని పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

బాధితుల్లో కొందరికి బొబ్బలు...

విషవాయువును పీల్చి అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఇతర వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆర్‌ఆర్‌ వెంకటాపురానికి చెందిన ఆకుల రామలక్ష్మి జబ్బ వద్ద గురువారం నుంచే దురదగా ఉంది. శుక్రవారం ఉదయానికి మంట పుట్టి.. చర్మం కమిలిపోయి బొబ్బలు రావడంతో చర్మ విభాగ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చాలామంది తమకు ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. బాధితులందరికీ కిడ్నీలు, కాలేయ పనితీరు నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వాటి నివేదికలు శనివారం రానున్నాయి. 48 గంటల తర్వాత కొత్త ఇబ్బందులు రావొచ్చని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ తరహా కేసులు ఇంతవరకు రాలేదని, ఒకేసారి వందల సంఖ్యలో అస్వస్థతకు గురికావడం, లేవలేని స్థితిలో ఆసుపత్రులకు రావడం వల్ల పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయాలని వైద్యులు అంటున్నారు. కొన్ని రకాల పరీక్షలు చేసేందుకు ప్రత్యేకంగా ఒక నమూనాను రూపొందించామని గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగ సహ ప్రొఫెసరు డాక్టర్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ గిరినాథ్‌ తెలిపారు.

బాధితులకు పూర్తిస్థాయిలో పరీక్షలు

ఏడు ప్రత్యేక విభాగాల వైద్యులు బాధితులకు చికిత్సలు చేస్తున్నారు. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం. బాధితులకు పూర్తిస్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాం. నివేదికలు వచ్చిన తర్వాతే ఇళ్లకు పంపుతాం. ప్రస్తుతం 305 మంది ఉండగా, ఎవరికీ ప్రాణాపాయం లేదు.. అంతా కోలుకుంటున్నారు. - జి.అర్జున, సూపరింటెండెంట్‌, కేజీహెచ్‌

ఇవీ చదవండి...విశాఖ ఘటనతో తెలంగాణలో కలవరం

Last Updated : May 9, 2020, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details