విశాఖపట్నంలోని రుషికొండపై ఉన్న మొత్తం 61 ఎకరాల్లో ప్రస్తుతం 9.88 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టు చేపడతామని.. మిగతా 51.12 ఎకరాల్ని భవిష్యత్తు విస్తరణ అవసరాల కోసం కేటాయించామని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) సీఆర్‌జెడ్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్ర అటవీ శాఖ పలు నిబంధనలతో అనుమతిచ్చింది. 2021 మే 19న అనుమతులిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్య ప్రాంత సరిహద్దుకు.. ఈ పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టు స్థలం సరిహద్దు 1.93 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, సీఆర్‌జెడ్-2 పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టులో కట్టడాల ఎత్తు 9 మీటర్లకు మించకూడదని నిబంధన విధించింది. కేంద్ర అటవీశాఖ విధించిన కీలక నిబంధనలివీ..
*భవనాలు జీ ప్లస్ వన్‌గా మాత్రమే ఉండాలి.
*హై టైడ్ లెవల్ (హెచ్‌టీఎల్)కు కనీసం 200 మీటర్ల దూరంలో ‘నో కన్‌స్ట్రక్షన్ జోన్’కు వెలుపలే నిర్మాణాలు చేపట్టాలి.
*నిర్మాణ స్థలంలో 139 చెట్లు కూల్చాల్సి ఉంటుందని ఏపీ అటవీశాఖ గుర్తించింది. ఏపీ వాల్టా చట్టం ప్రకారం ఖాళీ స్థలంలో అంతకు రెండింతలు (278) మొక్కలు నాటాలి.
*ప్రాజెక్టులో నిర్మాణాల కోసం భూగర్భజలాన్ని తోడరాదు. నిర్మాణ పనులతో వచ్చే వ్యర్థాలు, బురద, చెత్త వంటివి అనుమతించిన ప్రదేశాల్లో మాత్రమే పారబోయాలి. వాటి వల్ల స్థానికులపైన ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకూడదు.
*వ్యర్థజలాల్ని శుద్ధి చేయకుండా సముద్రంలోకి, ఇతర నీటివనరుల్లోకి పంపించరాదు. శుద్ధి చేసిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగించాలి.
*ఏపీటీడీసీ అనుమతి కోరుతూ చేసిన దరఖాస్తులో పేర్కొన్న డేటాలో వాస్తవ సమాచారం దాచిపెట్టినట్లు లేదా తప్పుడు సమాచారం సమర్పించినట్లు తేలినా, నిర్దేశిత నిబంధనలు పాటించకపోయినా అనుమతి ఉపసంహరించుకుంటాం. ప్రాజెక్టులో ఏ మాత్రం మార్పులున్నా.. కొత్తగా అనుమతి తీసుకోవాలి.