Tirumlala tour with Tribes : రవాణా సౌకర్యం లేక వేంకటేశుని దర్శన భాగ్యానికి నోచుకోని అరకు, పాడేరు ప్రాంత ఆదివాసీలను.. 2022 సంవత్సరంలో తిరుమల యాత్రకు తీసుకెళతామని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ప్రకటించారు. హిందూ ధర్మం పట్ల గిరిజనులు ప్రదర్శిస్తున్న గౌరవం చూస్తుంటే సంతోషం కలుగుతోందని ఆయన అన్నారు. భగవంతుని తత్వాన్ని తెలుసుకున్న వారిలో.. గిరిజనులు ముందుంటారని చెప్పారు.
విశాఖ ఏజెన్సీలోని అరకు సమీప రణజల్లెడ గ్రామాన్ని స్వామీజీ సందర్శించారు. విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన గిరిజన ధార్మిక సేవ కార్యక్రమంలో భాగంగా రణజల్లెడ వెళ్ళారు. చలితో ఇబ్బందులు పడుతున్న గిరిజన వృద్ధులు, పిల్లలకు రగ్గులు పంపిణీ చేశారు. అన్యమతాల ప్రలోభాలకు లోనుకాకుండా హిందూత్వాన్ని రక్షించే ఉద్యమ కర్తలుగా గిరిజనులు ఉండాలని సూచించారు. గిరిజనులను ధర్మపథం వైపు నడిపించే విషయంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. గిరిజన గోవిందం, దళిత గోవిందం తరహా కార్యక్రమాలను క్రమం తప్పకుండా విశాఖ శ్రీ శారదాపీఠం చేపడుతోందని తెలిపారు.