రైల్వేజోన్ ఏర్పడేందుకు విశాఖ మీద శ్రద్ధ కన్నా.. ఒడిశాలోని రాయగడ డివిజన్ ఏర్పాటు మీదే ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్‌లో ఇచ్చిన రూ.3కోట్లలో కొంత వరకు ఈ నూతన డివిజన్ కోసం ఖర్చు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. తాజా బడ్జెట్‌లో ఈ డివిజన్ ఏర్పాటుకు మరో రూ.40లక్షలు కేటాయించారు. విశాఖ ప్రస్తావన ఎక్కడా లేదు. కొత్త జోన్ ప్రక్రియ కోసం రూ.179.90 కోట్లు ఇది వరకూ మంజూరు చేశారు. ఈ నిధులు పేరుకే ఉన్నా.. ప్రత్యేకంగా జనరల్ మేనేజర్ అధికారిని నియమించడం, ఇతర ఉద్యోగుల్ని కేటాయించడం, కనీసం రైల్వేమంత్రిత్వశాఖలో పెండింగ్‌లో ఉన్న డీపీఆర్‌కు అనుమతివ్వడం వంటివి పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.
'వాల్తేరు'కు.. రూ.1422కోట్లు:వాల్తేరు డివిజన్‌కు ఈ బడ్జెట్‌లో రూ.1422 కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఈ మొత్తంలో ఇతర డివిజన్లతో కలిసిన రైల్వేలైన్లు, ఇతర పనులూ ఉన్నాయి. అలాగే జోన్ కార్యాలయం భువనేశ్వర్ నుంచి వాల్తేరుకు రావాల్సిన మరికొన్ని నిధులు పైనా స్పష్టత రావాల్సి ఉంది.