గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) వార్డుల పునర్విభజన నిమిత్తం ఈ నెల 24న జారీచేసిన తుది గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. జీవీఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు జారీచేసే అవకాశం ఉందో తెలపాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్ రెడ్డి(ఎస్‌జీపీ)ని కోరింది . ఈ వ్యాజ్యంలో కౌంటర్లు దాఖలు చేసేలోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆదేశిస్తామని వ్యాఖ్యానించింది. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిస్తూ నోటిఫికేషన్ ఎప్పుడు జారీచేసే విషయం తనకు తెలియదని, వివరాలు కనుక్కొని కోర్టు ముందు ఉంచేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేశారు.
సగటు జనాభా లేరు
వార్డుల పునర్విభజన నిమిత్తం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ సవాలు చేస్తూ విశాఖకు చెందిన వెంకట ప్రణవ్ గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వార్డుల విభజన చేశారన్నారు. అభ్యంతరాల సమర్పణకు వారం రోజులు గడువిస్తే అందులో నాలుగు రోజులు ప్రభుత్వ సెలవులు ఉన్నాయని చెప్పారు. సుమారు 50 వార్డుల్లో చట్ట నిబంధనల మేరకు సగటు జనాభా లేదన్నారు. మరికొన్ని వార్డుల్లో సగటు జనాభాకు మించి ఉన్నారన్నారు. జీవో జారీచేసిన రోజే ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారని వివరించారు. ఆ నోటిఫికేషన్‌పై కోర్టు విచారణ జరుపుతున్న సమయంలో తుది నోటిఫికేషన్ ఇచ్చారన్నారు.