ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తీరం వైపు దూసుకొస్తున్న 'అసని'.. అధికారుల అప్రమత్తం - asani cyclone news

Rains in AP: బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న 'అసని'.. దిశ మార్చుకొని తీరంవైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రంలోగా మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

asani cyclone
asani cyclone

By

Published : May 10, 2022, 5:35 AM IST

Updated : May 10, 2022, 7:48 PM IST

Asani Cyclone Alerts: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.

Flights Cancelled Due to Asani cyclone: మరోవైపు 'అసని' తీవ్ర తుపాను కారణంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి అన్ని ఇండిగో విమానాలను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేశారు. మొత్తం 23 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఎయిర్ ఏషియాకు చెందిన దిల్లీ- విశాఖ, బెంగళూరు- విశాఖ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆ విమానయాన సంస్థ ప్రకటించింది. ఎయిర్‌ ఇండియాకు చెందిన ముంబయి- రాయపూర్‌- విశాఖ, దిల్లీ- విశాఖ విమానాలు రద్దయ్యాయి. తుపాను నేపథ్యంలో తీవ్ర గాలుల వల్ల ముందు జాగ్రత్త చర్యగా తమ సర్వీసులను రద్దు చేసినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి.

తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:తుపాను దృష్ట్యా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి తానేటి వనిత సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌తో మాట్లాడిన హోం మంత్రి.. ప్రస్తుత పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను దృష్ట్యా అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. తీర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలోనూ వర్షాలు..:తుపాను ప్రభావం తెలంగాణపైనా పడే అవకాశముంది. రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

వెనుతిరిగిన విమానాలు:విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని ఆనందపురం, అచ్యుతాపురం మండలాల్లో గాలుల తీవ్రతకు పలు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. వాటిని సరిచేసి, విద్యుత్తు పునరుద్ధరణ చర్యలు తీసుకున్నట్లు ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ మహేంద్రనాథ్‌ తెలిపారు. కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి విశాఖకు సోమవారం మధ్యాహ్నం నుంచి వచ్చిన విమానాలు వాతావరణం అనుకూలించకపోవడంతో చాలాసేపు గాలిలో చక్కర్లుకొట్టి వెనుదిరిగాయి. రాత్రికి ముంబై, చెన్నై, విజయవాడ, హైదరాబాద్‌ల నుంచి విశాఖకు రావాల్సిన ఇండిగో విమానాలను రద్దు చేశారు. తుపాను నేపథ్యంలో వాల్తేరు రైల్వే డివిజన్‌ అప్రమత్తమైంది.

కాకినాడ తీరంలో అల్లకల్లోలం: కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై ‘అసని’ ప్రభావం అధికంగా కనిపించింది. ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట, మాయాపట్నం, కోనపాపపేట గ్రామాలపై అలలు ఎగసి పడుతున్నాయి. పలువురి ఇళ్లు కోతకు గురై కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ వరకున్న బీచ్‌ రోడ్డుపైకి సముద్రం నీరు చొచ్చుకు రావడంతో వాహనాల రాకపోకలను నిలిపేశారు. అలల తీవ్రతకు సోమవారం ఉప్పాడ తీరానికి భారీ బార్జి కొట్టుకొచ్చింది. అందులో సుమారు వంద లారీల భారీ మెటల్‌, జేసీబీలు ఉన్నాయి. కాకినాడ పోర్టులోకి వెళ్లలేని భారీ ఓడల వద్దకే బార్జీలో సరకు తీసుకెళ్లి లోడింగ్‌ చేస్తారు.

బంగాళాఖాతంలో ‘అసని’ తుపాను కారణంగా తీవ్ర గాలులు వీయడంతో కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. సోమవారం ఉదయం నుంచే విశాఖ తీరంలో అలలు ఎగిసిపడ్డాయి. రుషికొండ, సాగర్‌నగర్‌ ప్రాంతాల్లో సముద్రం కొంత ముందుకు వచ్చింది. గాలుల తీవ్రతకు కొన్నిచోట్ల 15-20 అడుగుల వరకు అలలు ఎగిసిపడ్డాయి. సముద్రంలో సుడులు తిరుగుతుండటంతో పర్యాటకులను తీరంలోకి అనుమతించలేదు. హార్బరు, రుషికొండ వద్ద పర్యాటకశాఖ నడిపే విహార బోట్లను నిలిపేశారు.

అయ్యయ్యో... ‘అన్నమయ్య’ బాధితులు :అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో గతేడాది నవంబరు 19న అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోవడంతో పులపుత్తూరు గ్రామం అతలాకుతలమైంది. వరదలో ఇళ్లు, నగలు, నగదుతోపాటు సర్వం కోల్పోయిన సుమారు 200 బాధిత కుటుంబాలు తాత్కాలికంగా గుడిసెలు, షెడ్లు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి వీస్తున్న బలమైన ఈదురు గాలుల తాకిడికి రేకులు, గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. దాంతో బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్లు కుప్పకూలిపోయాయి. విద్యుత్తు వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇనుప రేకు పడి బుడ్డెమ్మ అనే మహిళకు గాయాలయ్యాయి. అప్పట్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించి ఇంటి నిర్మాణాలు చేపట్టి కన్నీళ్లు తుడుస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. ప్రస్తుతం ఎండలకు అల్లాడిపోతుండగా, ఈదురుగాలులకు ఉన్న గూడు సైతం పోయిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. చిమ్మచీకటిలో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

చెట్టు కొమ్మ విరిగిపడి మహిళ మృతి :శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలుల కారణంగా మహిళ దుర్మరణం పాలయ్యారు. తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా గాలుల తీవ్రత పెరిగింది. పోలాకి మండలం నందిగాంలో ఎడ్ల లక్ష్మి(45) అనే మహిళ సరకుల కోసం రేషన్‌ వాహనం వద్దకు రాగా ఆమెపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువతికి గాయాలయ్యాయి.

ఇదీ చదవండి:Cyclone Asani: తీవ్ర తుపానుగా 'అసని'.. కోస్తాంధ్రలో వర్షాలు

Last Updated : May 10, 2022, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details