Pattabhi On ORR: అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డును (ఓఆర్‌ఆర్) రూ.17,761 కోట్లతో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం చెబుతుంటే... అది వద్దని, విజయవాడకు 78 కి.మీ. బైపాస్ రోడ్డు చాలంటూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెప్పడం ఓఆర్‌ఆర్‌కు ఉరివేయడం కాకపోతే మరేమిటని తెదేపా జాతీయ అధికారి ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో పదే పదే స్పష్టం చేస్తున్నా సరే.... కేంద్రం ఆ ప్రతిపాదనను చెత్తబుట్టలో పడేసిందని అబద్దాలు చెప్పడానికి మంత్రి పేర్ని నానికి సిగ్గు అనిపించడం లేదా అని నిలదీశారు. ముందు ఆయన ఔటర్ రింగ్‌రోడ్డుకు... బైపాస్ రోడ్డుకు తేడా ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. ఎవరైనా 189 కి.మీ.ల ఓఆర్‌ఆర్‌ను వద్దని.. 78 కి.మీ.ల బైపాస్ రోడ్డు చాలంటారా? ఇది దుర్మార్గం కాదా? అని పట్టాభి ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో, ఆ తర్వాత ‘ఈనాడు’తోనూ ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ జరిపి ఇస్తే ఓఆర్‌ఆర్ నిర్మిస్తామని కేంద్రం చెబుతుంటే అది వద్దని ఎలా లేఖ రాస్తారు? అంటూ నిలదీశారు. పట్టాభిరామ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...
ఓఆర్‌ఆర్‌కు, బైపాస్‌కు తేడా తెలీదా?
*వైకాపా ప్రభుత్వానికి, మంత్రి పేర్ని నానికి... ఓఆర్‌ఆర్‌కీ, బైపాస్ రోడ్డుకీ తేడా తెలీదా? రాజధాని అమరావతితో పాటు, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలను మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాలను కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన సమగ్ర ప్రణాళికలో భాగమే ఓఆర్‌ఆర్. ఇది కేవలం ట్రాఫిక్ తగ్గించటానికి ఉద్దేశించినది కాదు.. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే చోదకశక్తి. విజయవాడపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డూ, ఈఓఆర్‌ఆర్ ఒకటే అన్నట్లుగా మాట్లాడతారా? ఓఆర్‌ఆర్ కేవలం విజయవాడను దృష్టిలో పెట్టుకుని రూపొందించలేదన్న విషయం మీకు తెలీదా?
*విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జనాభానే సుమారు 18.50 లక్షలు. ప్రతిపాదిత ఓఆర్‌ఆర్ పరిధిలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మొత్తం జనాభా 36-37 లక్షలు ఉంటుందని అంచనా. వాస్తవాలు ఇలా ఉంటే... విజయవాడ జనాభా కేవలం 10 లక్షలేనని, కేవలం విజయవాడ కోసం గత ప్రభుత్వం నగరానికి 40 కి.మీ.ల దూరం నుంచి ఓఆర్‌ఆర్ ప్రతిపాదించిందనీ అబద్ధాలు చెప్పడం ఏమిటి? ఓఆర్‌ఆర్‌కి పూర్తిగా లోపల ఉన్నవి, ఓఆర్‌ఆర్ వెళ్తున్న మండలాలు 40 ఉన్నాయి. దీనివల్ల విజయవాడ, గుంటూరులతో పాటు తెనాలి, మంగళగిరి, గుడివాడ, గొల్లపూడి, నూజివీడు, కొండపల్లి, పొన్నూరు, సత్తెనపల్లి, ఉయ్యూరు ప్రాంతాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా శరవేగంగా పురోగతి సాధిస్తాయి. అలాంటి ఓఆర్‌ఆర్‌కు తిలోదకాలిచ్చి పైగా తామేదో మేలు చేస్తున్నామని, అభివృద్ధి అంతా తమ హయాంలోనే జరుగుతోందనీ జగన్ ప్రభుత్వం చెప్పడమేమిటి?
*ఇప్పుడు నిర్మాణంలో ఉన్న విజయవాడ బైపాస్‌రోడ్డును కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రానికి ఎలాంటి సంబంధమూ లేదు. పైగా రాజధాని అమరావతి ప్రతిపాదనకు ముందే... 2011లోనే ఆ బైపాస్ రోడ్డుకు ప్రణాళిక సిద్ధమైంది. 2012లో భూసేకరణ జరిగింది. గతంలోనే గామన్ ఇండియా సంస్థకు ఆ రోడ్డు నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తే... ఆ సంస్థ పనులు చేయలేదు. మళ్లీ టెండర్లు పిలిచి వేరే సంస్థలకు అప్పగించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దాన్నీ తన ఖాతాలోనే వేసేసుకుని గొప్పలు చెప్పడమేమిటి?
*కృష్ణా జిల్లాలో 49, గుంటూరు జిల్లాలో 39 గ్రామాలను తాకుతూ వెళ్లేలా ఓఆర్‌ఆర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. ఆర్.వి.అసోసియేట్స్ సంస్థ ఫీజిబిలిటీ రిపోర్టు సిద్ధం చేసింది. 11 ప్రధాన వంతెనలు, ఏడు ఆర్‌వోబీల నిర్మాణం చేపట్టదలిచాం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 3,404 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. అందుకు రూ.4,200 కోట్లు అవసరమని లెక్క తేల్చాం. మొదటి దశలో కంచికచర్ల నుంచి పొత్తూరు వరకూ 63 కి.మీ, రెండో దశలో పొత్తూరు నుంచి పొట్టిపాడు వరకూ 53 కి.మీ. మూడోదశలో పొట్టిపాడు నుంచి కంచికచర్ల వరకూ 65 కి.మీ మేర నిర్మించేలా ప్రణాళిక వేశాం.
*ఏయే జిల్లాల్లో ఎంతెంత భూమి సేకరించాలి? ప్యాకేజీల వారీగా ఎలా పూర్తి చేయాలి? వివరాలతో ఓఆర్‌ఆర్ నిర్మాణానికి తెదేపా హయాంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ఫీజిబిలిటీ నివేదిక సిద్ధం చేసి వివరంగా కేంద్రానికి పంపించాం. ఇవన్నీ గూగుల్ మ్యాప్‌లో పిచ్చి గీతలా?
*ఓఆర్‌ఆర్ పూర్తయితే 4 లక్షల ఎకరాల భూమి అభివృద్ధి కార్యక్రమాలకు అందుబాటులోకి వస్తుంది. 36-37 లక్షల మంది జనాభాకు సరిపడా మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి.
గుంతలు పూడ్చలేని మీరు..ఫ్లై ఓవర్లు కట్టారా?