గత ప్రభుత్వ హయంలో విశాఖ జిల్లా అనకాపల్లిలోని పేద ప్రజల కోసం మంజూరు చేసిన టిడ్కో ఇళ్లను...విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలకు కేటాయించటాన్ని నిరసిస్తూ...అనకాపల్లిలో బాధితులు నిరాహార దీక్ష చేపట్టారు. వారికి తెదేపా నేతలు మద్దతు పలికారు. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు..అనకాపల్లిలోని పేద ప్రజల కోసం కేటాయించిన ఇళ్లను దక్షిణ నియోజకవర్గ వాసులకు ఇవ్వాలనుకోవటం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమారుడు తెదేపా నుంచి వైకాపాలో చేరటంతో ఆయన సూచన మేరకు ఇళ్లను తరలిస్తున్నారని మండిపడ్డారు.
అక్కడి ప్రజలపై ప్రేముంటే కొత్తగా భవనాలు నిర్మించి ఇవ్వాలే తప్ప..పేదల ప్రజలకు కేటాయించిన ఇళ్లను తరలించడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.