మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఆ భూములను తిరిగి జీవీఎంసీకి స్వాధీనపరిచేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
'ముడసర్లోవ వద్ద 40 ఎకరాల్లో తెదేపా నేతలు నిర్మించిన షెడ్లను జీవీఎంసీ కూల్చివేసి ఆ భూములను స్వాధీనం చేసుకుంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, ఆయన బినామీలు భూములను కబ్జా చేశారు. వీటిలో పలు చోట్ల నిర్మాణాలు, లేఅవుట్లు, కొబ్బరి, మామిడి మొక్కలున్నాయి. కొన్ని భూముల్లో షెడ్లు వేసి అమ్ముకున్నారు. రామకృష్ణాపురం సర్వే నంబరు 26లో ఎమ్మెల్యే బినామీ వేసిన అక్రమ లేఅవుట్‌ను జీవీఎంసీ తొలగించింది. ఎస్‌ఎస్‌నగర్- పైనాపిల్ కాలనీ మధ్యలో ఆక్రమణలో ఉన్న పదెకరాలను స్వాధీనం చేసుకునేందుకు కోర్టులో వ్యాజ్యం వేసింది. ముడసర్లోవ వద్ద ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న 11.15 ఎకరాల స్వాధీనానికి జీవీఎంసీ కోర్టుకు వెళ్లింది. అక్కడే ఇతర సర్వేనెంబర్లలో ఆక్రమణలో ఉన్న 42.26 ఎకరాల స్వాధీనానికి సీసీఎల్‌ఏకి విజ్ఞప్తి చేసింది. మరో 66 ఎకరాలకు సంబంధించి ఆ భూమి తమదేనంటూ మరిక పైడయ్య మరో 65 మంది, వేరే సర్వే నెంబర్లో 2.80 ఎకరాలు తమవేనంటూ కాశీరామ్ తదితరులు పిటిషన్లు వేశారు. వాటన్నింటికీ వ్యతిరేకంగా జీవీఎంసీ చేసిన అప్పీళ్లు సీసీఎల్‌ఏ విచారణలో ఉన్నాయి' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడేవారు వైకాపా సహా ఏ పార్టీకి చెందినవారైనా వదిలిపెట్టేదిలేదన్నారు.