ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మికులు, నిర్వాసితులు చేస్తున్న ఆందోళనలో పాల్గొని.. తెదేపా తరపున మద్దతు తెలియజేశారు. దిల్లీ రైతుల తరహా పోరాటం విశాఖ ప్రజలు చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. ఎలాంటి త్యాగాలకైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటీకరణ చేస్తే సరిపోతుందని.. ప్రభుత్వాలకు ఓటు వేసేది అభివృద్ధి కోసమని తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌కు సొంత నిధులు కేటాయించకుండా అన్యాయం చేసి.. ప్రస్తుతం లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటుపరం చేయాలనుకోవడం దారుణమని తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు బండారు సత్యనారాయణ, టీఎన్టీయూసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.