ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో అలజడి.. తెదేపా నేత పల్లా శ్రీనివాస్ భవనం కూల్చివేత - greater visakha municipal corporation

విశాఖలో తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ పనులు చేపట్టే అవకాశం ఉన్నందున.. అక్కడ నిర్మాణాన్ని అనుమతించలేమని అధికారులు తేల్చిచెప్పారు. జీవీఎంసీ, అధికార వైకాపా తీరుపై మండిపడిన పల్లా శ్రీనివాస్.. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కూలగొట్టారన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చివేయడమేంటని నిలదీశారు.

tdp leader palla srinivasa rao
greater visakha municipal corporation

By

Published : Apr 25, 2021, 8:41 PM IST

Updated : Apr 26, 2021, 5:43 AM IST

విశాఖ నగరంలోని పాతగాజువాక జాతీయ రహదారి కూడలిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే, తెదేపా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) అధికారులు ఆదివారం కూల్చేశారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా ధ్వంసం చేయడమేమిటంటూ పల్లా ప్రశ్నిస్తున్నా... అధికారులు వినిపించుకోలేదు. ఒకవైపు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండగా జోన్‌-6 పట్టణ ప్రణాళిక విభాగం డీసీపీ నరేంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలో గాజువాక, దువ్వాడ సీఐలు మల్లేశ్వరరావు, లక్ష్మి భారీ బందోబస్తు నడుమ తెల్లవారుజామున 3.45 గంటలకు 30 మంది సిబ్బంది, వంద మందికి పైగా పోలీసులు, భారీ యంత్ర సామగ్రిని రంగంలోకి దింపి కూల్చివేత ప్రారంభించారు. ఆదివారం రాత్రి 7 గంటల వరకు భవనం కూల్చివేత కొనసాగింది.

గాజువాక సర్వే నంబరు-5/1లో పల్లా శ్రీనివాసరావు కుటుంబానికి సుమారు 800 చదరపు గజాల స్థలముంది. జీవీఎంసీ నుంచి అనుమతులు తీసుకుని ఏడాది క్రితం షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మాణం ప్రారంభించారు. ప్రస్తుతం అది నిబంధనలకు విరుద్ధమని చెప్పి 25.46 చదరపు మీటర్ల(274 అడుగుల) మేర భవనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రణాళికకు విరుద్ధంగా పనులు చేపడుతుంటే ఇటీవల హెచ్చరించామని, అయినా పట్టించుకోకపోవడంతో చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని జీవీఎంసీ ప్రణాళిక విభాగం డీసీపీ నరేందన్రాథ్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ప్లాన్‌ అప్రూవల్‌ ఇచ్చేటప్పుడు అండర్‌ టేకింగ్‌ లెటర్‌ తీసుకుంటామని, అందులో అతిక్రమణ (డీవియేషన్‌) ఉంటే కట్టడంపై చర్య తీసుకోవచ్చని రాసి ఉంటుందని ఆయన వివరించారు. ముందస్తు నోటీసు ఇచ్చామంటూ ప్రణాళిక సిబ్బంది చెప్పగా ‘అలాంటిదేమీ ఇవ్వలేదని, దేవుడి గుడిలో ప్రమాణం చేద్దాం రండి’అని అంటూ పల్లా శ్రీనివాసరావు గట్టిగా వాదించారు. దీంతో పోలీసులు ఆయనను పక్కనే ఉన్న తెదేపా కార్యాలయం వద్దకు తీసుకెళ్లి కూల్చివేత ప్రారంభించారు. ‘అన్ని అనుమతులూ ఉన్నా నాపై కక్షపూరితంగా వ్యవహరించి కట్టడాన్ని కూల్చివేశారు. ఈ అన్యాయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటా. జాతీయ రహదారి కోసం భూసేకరణ పేరిట రోడ్డు జాగాలో నిర్మాణం ఉందంటూ కూల్చివేయడం బాధాకరం’ అని పల్లా ఆవేదన వ్యక్తం చేశారు.

పనిదినాల్లో అక్రమాలు.. సెలవు రోజుల్లో విధ్వంసాలు: అచ్చెన్నాయుడు
వైకాపా ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి పనిదినాల్లో అక్రమాలు, సెలవు దినాల్లో విధ్వంసాలకు పాల్పడుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కరోనాతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే దానిపై దృష్టిపెట్టకుండా తెదేపా నేతల భవనాలను కూలుస్తోందని దుయ్యబట్టారు. ‘విద్వేషం, విధ్వంసం లేకుండా వైకాపా ఉనికి లేదు. రోజురోజుకి వైకాపా రాక్షస సంస్కృతి పెరుగుతోంది. ఇంట్లో మనుషులు లేని సమయం చూసి... కోర్టు సెలవు రోజుల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వం కక్ష పూరితంగా తెదేపా నేతల ఇళ్లు, భవనాలు కూల్చి వేస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగడం దుర్మార్గం. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున వచ్చి భవనాన్ని కూల్చడం దారుణం. ఆ పార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించారు.


కరోనా వైరస్‌ కట్టడి వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘ప్రజలకు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యాధి నిర్ధారణ ఫలితాలు కూడా సమయానికి ఇవ్వడం లేదు. ఆక్సిజన్‌, మందులు, వ్యాక్సిన్‌ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ దారి మళ్లించేందుకు మొన్న తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్టు చేశారు. ఇప్పుడు విశాఖలో పల్లా శ్రీనివాస్‌ ఆస్తులను ధ్వంసం చేశారు. రేపు రాయలసీమలో ఏముంటుందో తెలీదు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పల్లా శ్రీనివాస్‌ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’ అని పేర్కొన్నారు.

.

ఇదీ చదవండి:సెల్ఫీ వీడియో వైరల్​: నేను కరోనాతో చనిపోతే.. బాధ్యత మా ఎస్సైదే

Last Updated : Apr 26, 2021, 5:43 AM IST

ABOUT THE AUTHOR

...view details