విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర నిర్ణయాన్ని అందరూ ఖండించాలని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం 64 గ్రామాలను తీసుకున్నారన్న అయ్యన్న...ఉక్కు పరిశ్రమలో 40వేల మంది వరకు పని చేస్తున్నారన్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి మరో లక్షమంది బతుకుతున్నారని వివరించారు. మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షల మంది రోడ్డున పడతారన్నారు. ఉక్కు పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు అనేకమంది నాయకులు ఆదుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు వీల్లేదన్న అయ్యన్న...దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ మౌనం వీడి వెంటనే కేంద్రంతో మాట్లాడాలని సూచించారు. జగన్ 20 సార్లు దిల్లీ వెళ్లారు.. రాష్ట్రానికి ఏం తెచ్చారు..అని అయ్యన్న ప్రశ్నించారు. కేంద్ర పెద్దలను కలిసినప్పుడు అందరూ మీడియాతో మాట్లాడతారు... మీరు మాత్రం అంతా గోప్యంగా ఉంచుతారు ఎందుకని నిలదీశారు.