'ప్రజా ఛార్జిషీటు' లోని అంశాల్లో ఒక్కో రోజు ఒక్కో అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా రాష్ట్రంలో పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందని వెల్లడించారు. తెదేపాకు 160 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘సామాజిక న్యాయం అంటున్న మంత్రులు నోరులేని మూగజీవులు. రాష్ట్రాన్ని కేవలం విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏలుతున్నారు. జగన్మోహన్రెడ్డి ఈ నలుగురి చేతిలో పగ్గాలు పెట్టారు’ అని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆయన ఏమన్నారంటే..
*‘మూడేళ్ల వైకాపా పాలనలో జగన్ సొంత పత్రికలో పనిచేసిన వారిని సలహాదారులుగా, పీఆర్వోలుగా నియమించుకొని ప్రజల సొమ్మును ధారాదత్తం చేశారు. గత ప్రభుత్వ పథకాలైనప్పటికీ కొత్తవని చెబుతూ ప్రచారానికి సాక్షి పత్రికకు కోట్లు ఖర్చు పెడుతూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.
*గత ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టులను ఆపేసి రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటివరకు పనిచేసిన గుత్తేదారులను తొలగించారు. సొంత మనుషులను పెట్టుకొని ఈ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సర్వనాశనం చేశారు.
*2014-19 మధ్యలో సన్‌రైజ్ రాష్ట్రంగా ఏపీ కొనసాగింది. పోలవరం, అమరావతి పనులు నిరంతరాయంగా సాగాయి. విశాఖ ఐటీ హబ్‌గా కళకళలాడింది. అలాంటి నగరాన్ని విధ్వంస విశాఖగా మార్చేసిన ఘనుడు జగన్. ఒక్క పరిశ్రమనైనా విశాఖకు తీసుకురాలేదు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన అదానీ డేటా సెంటర్‌ను రద్దు చేసి దావోస్‌లో మళ్లీ అదే సెంటర్ కోసం ఒప్పందం చేసుకున్నారు. అదానీని కలిసేందుకు దిల్లీ వెళితే సరిపోతుంది కదా. ఇటీవల కర్నూలులో ప్రారంభించిన గ్రీన్కో ప్రాజెక్టుకు గత ప్రభుత్వ హయాంలోనే భూమి కేటాయించాం. దీని పనులను ఇటీవల జగన్ పరిశీలించారు. ఈ ప్రాజెక్టు వారిని దావోస్‌కు పిలిపించి ఒప్పందం చేసుకున్నట్లు మళ్లీ చూపించడం ఎంత దారుణం?