ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కును (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్) కొనుగోలు చేయాలన్న ఆసక్తి తమకు ఉందని టాటా స్టీల్ తెలిపింది. ఆ విషయాన్ని కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్ టి.వి. నరేంద్రన్ ధ్రువీకరించారు. విశాఖలోని ఆర్‌ఐఎన్‌ఎల్‌కు 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉంది. ఈ సంస్థలో 100 శాతం వాటాను విక్రయించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ జనవరి 27న ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
విశాఖ ఉక్కును కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉందా అని పీటీఐ వార్తాసంస్థ ప్రతినిధి ప్రశ్నించగా.. ‘అవును. లాంగ్ ప్రొడక్ట్స్‌కున్న వృద్ధి దృష్ట్యా, ఆ సంస్థపై మాకు ఆసక్తి ఉంది. దేశ దక్షిణ ప్రాంతంలో తూర్పు దిక్కున ఉండటం, తీర ప్రాంత ప్లాంటు కావడంతో చాలా ప్రయోజనాలుంటాయి’ అని నరేంద్రన్ పేర్కొన్నారు. 22,000 ఎకరాల భూమి ఉన్న ఆర్‌ఐఎన్‌ఎల్‌కు గంగవరం పోర్టు దగ్గర కావడంతో, కోకింగ్ కోల్ వంటి ముడి పదార్థాలను సులువుగా రవాణా చేసే వీలుంది. విశాఖ ఉక్కు భారత తూర్పు తీరంలో ఉండటం వల్ల టాటా స్టీల్ దీనిని కొనుగోలు చేస్తే, ఆగ్నేయాసియా మార్కెట్లకు సులువుగా ఎగుమతులు చేయగలదు. ఇప్పటికే ఆయా దేశాలకు ఆ కంపెనీ ఎగుమతులు చేస్తోంది.