ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ నగరానికి ఏమైంది...? ఒకవైపు చెత్త... మరోవైపు గుంతలు! - విశాఖలో లోపించిన శుభ్రత

స్వచ్ఛ నగరం.. అంటే ఏపీలో ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది విశాఖ. హుద్‌హుద్ వంటి విలయాన్ని అధిగమించి... మెరుగైన పారిశుద్ధ్యం దిశగా అడుగులు వేసింది. అయితే 2, 3ఏళ్లుగా విశాఖ స్వచ్ఛ పరుగులో తడబడుతోంది. ఏటికేడు 'స్వచ్ఛ సర్వేక్షణ్' ర్యాంకుల్లో నగరం స్థానం దిగజారుతోంది. 'స్వచ్ఛ విశాఖ' బ్రాండింగ్‌కూ ఇవి ముప్పుగా మారుతున్నాయి.

swachatha going back in vishakapatnam
విశాఖలో లోపించిన శుభ్రత

By

Published : Dec 7, 2019, 12:46 PM IST

విశాఖలో లోపించిన శుభ్రత

ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్​ పిలుపుతో... ఆ దిశగా అడుగులేసిన నగరం విశాఖ. స్వచ్ఛ సర్వేక్షణ్​ ర్యాంకుల్లో 2015లో 205వ స్థానం నుంచి ప్రారంభమైన విశాఖ స్వచ్ఛ యాత్ర... ఆ తరువాతి ఏడాది 5. మరో అడుగు ముందుకేసి మూడో స్థానం ఇలా 2017 వరకు సాగింది... అక్కడి నుంచి విశాఖ స్వచ్ఛ ప్రస్థానం తిరోగమనం దిశగా మళ్లింది. రెండేళ్ల వ్యవధిలో అత్యుత్తమ మూడు స్వచ్ఛ నగరాల్లో ఒకటిగా ఉన్న విశాఖ 23వ స్థానానికి దిగజారిపోయింది.

విశాఖ నగరంలో ప్రస్తుత పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా ఉంచాల్సిన జీవీఎంసీ కార్యాలయ పరిసరాలే అధ్వానంగా ఉన్నాయి. చెత్తా చెదారం, బహిరంగ మూత్రవిసర్జన, అనధికార పార్కింగ్ సమస్యలు అక్కడ తిష్ట వేశాయి. గతుకుల రహదారుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... ప్రాజెక్టు, భూగర్భవిద్యుత్ సరఫరా వ్యవస్థ పనుల కోసం విశాఖ నగర రహదారులు తవ్వి పోశారు. ఎటు నుంచి ఎటు వెళ్లినా మట్టి, దుమ్ముతో స్వాగతం పలికే మార్గాలే.

మద్దిలపాలెం, సెంట్రల్ పార్కు, జీవీఎంసీ సహా అనేక మార్గాల్లో వెళ్లే వారికి ముక్కులు అదిరిపోతున్నాయి. మరుగుదొడ్లు ఉన్నా.. వినియోగం అంతంత మాత్రమే. కొన్నిటికి తాళాలు వేసి ఉంటాయి. నిర్వహణ లేమి, కనీసం నీటి సదుపాయం లేక మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి. ఇలా నగర శోభ దెబ్బతింటోంది. గతంలో ఉండే పౌర స్పృహ క్రమంగా తగ్గిపోతూ వస్తుండడానికి కారణంగా మారుతోంది.

స్వచ్ఛ సర్వేక్షణ్​లో ప్రజల స్పందన, భాగస్వామ్యం ఎంతో కీలకం. ఈ ఏడాది ప్రజల నుంచీ ఆశించినంత స్థాయిలో మేలైన స్పందన వస్తుందని చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా స్వచ్ఛసర్వేక్షణ్‌కు సంబంధించి జీవీఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టలేదు. ప్రజలను మమేకం చేసే దిశగా, అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ కానరాకపోవడం భవిష్యత్తులో స్వచ్ఛ విశాఖ ఖ్యాతికి కలగబోయే నష్టాన్ని కళ్లకు కడుతోంది.

ఇదీ చదవండి

మొత్తం 12 బుల్లెట్లు.. నలుగురి ఖేల్ ఖతం!

ABOUT THE AUTHOR

...view details