విశాఖ సాగరతీరం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. యారాడ నుంచి భీమిలీ వరకు ఇసుక తిన్నెలతో సుందర కాంతులను పంచే బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పర్యాటకంగా ఎంతో ప్రత్యేక గుర్తింపు సంతరించుకున్న మన సాగర నగరికి బ్లూ ఫ్లాగ్ దక్కించుకునే అరుదైన అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఇప్పుడు రుషి కొండ బీచ్‌ను బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం తీర్చిదిద్దుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఇప్పటికే అనేక సదుపాయాలు ఇక్కడ కల్పించారు.
పరిశుభ్రత, భద్రత లక్ష్యాలుగా ప్రభుత్వం చేసే అభివృద్ధి ఓ వైపు అయితే... సందర్శకులు కూడా భాగస్వాములు కావాల్సిన సమయం వచ్చింది. అద్భుత తీర ప్రాంతం అందాలను ఆస్వాదించడానికి రుషికొండకు వెళ్తున్నారా..? అయితే 'ఐ యామ్ సేవింగ్ మై బీచ్' అని అనాల్సిందే. ఉన్నత లక్ష్యం కోసం జరుగుతున్న ప్రయత్నాన్ని విజయ తీరాలకు చేర్చటంతో సందర్శకుల పాత్ర ఎంతో కీలకంగా మారింది.