విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు చిన్న కోడలు ఆడారి దేవకి (39) మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
పోలీసుల కథనం ప్రకారం..
తులసీరావు చిన్న కుమారుడు సంతోష్ భార్య దేవకి. కొద్దికాలంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో ఆమె బాధపడుతున్నారు. మంగళవారం విపరీతంగా నొప్పి రావడంతో భరించలేక ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నారు. ఆమె భర్త సంతోష్, ఇంట్లో పనిచేస్తున్న మూలినాయుడు ఆమెను వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొనఊపిరితో ఉన్న ఆమెను అక్కడి నుంచి షీలా నగర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి రాత్రి 11.30 గంటలకు ఆమె చనిపోయారని చెప్పారు.
దేవకి చెల్లెలు మళ్ల దీప్తి మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎలమంచిలి పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వివాహమైన నాటి నుంచి సంతోష్, దేవకి చాలా అన్యోన్యంగా ఉంటున్నారని దీప్తి తన ఫిర్యాదులో వివరించారు. దీంతో పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
దేవకి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వారంతా కొడైకెనాల్లో చదువుకుంటున్నారు.
దేవకి మరణవార్త తెలిసి ఆమె స్వగ్రామం కె. కోటపాడు మండలం చౌడువాడ నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు కిమ్స్ ఆసుపత్రికి తరలివచ్చారు. విగతజీవిగా మారిన ఆమెను చూసిన కన్నీరుమున్నీరయ్యారు. దేవకి తల్లి సరస్వతిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేకపోయామని ఆమె రోదించారు.
ఇదీ చదవండి:బాలిక మృతి కేసును ఛేదించిన పోలీసులు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకడం వల్లే