ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్పొరేట్‌ విద్యకు కోత.... గిరిజన విద్యార్థులకు నిరాశ!

ఎస్సీ, ఎస్టీల్లో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వరంలా మారిన బెస్ట్ అవైలబుల్‌ స్కూల్స్ (బీఏఎస్‌) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 9, 10 తరగతులకు పరిమితం చేయటం వల్ల విశాఖ మన్యానికి చెందిన విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న మూడు వేల మంది విద్యార్థుల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

vishaka agency
vishaka agency

By

Published : Nov 8, 2020, 4:40 PM IST

ఎస్సీ, ఎస్టీలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉన్నత విద్య అందించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. పథకం కింద ఒకటో తరగతిలో ప్రవేశానికి లాటరీ విధానం, ఆరో తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు. ఎంపికైన విద్యార్థులు ఉచితంగా కార్పొరేట్‌ పాఠశాలల్లో విద్యనభ్యసించేవారు. విద్యార్థులు కోరుకున్న పాఠశాలల్లో అధికారులు చేర్పించేవారు. ఈ విధానంలో కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుతున్న డేస్కాలర్‌ విద్యార్థులకు రూ.20 వేలు, వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు రూ.30 వేల చొప్పున బోధన రుసుమును వాటి యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లించేది.

అయితే ఈ ఏడాది నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలల్లో వసతులకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారు. జగనన్న విద్యా కానుకలను అందించడం ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. దీనికితోడు అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే బీఏఎస్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

దీనివల్ల కార్పొరేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విశాఖ ఐటీడీఏ పరిధిలోని 12 మండలాలకు చెందిన విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. బీఏఎస్ పథకం రద్దు కావటంతో ఫీజులు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులను కార్పొరేట్ పాఠశాలలు కోరుతున్నాయి. లేదంటే టీసీలు తీసుకోవాలని చెబుతున్నాయి. దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఏమి చేయాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో మాదిరి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అనువైన పరిస్థితులు ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పడలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అప్పటివరకు కార్పొరేట్‌ పాఠశాలల్లో తమ పిల్లలను చదివేందుకు వీలుగా పథకాన్ని కొనసాగించాలని కోరుతున్నారు.

9,10 తరగతుల బాలబాలికలకు మాత్రమే బీఏఎస్‌ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్‌ విద్యకు దూరమైన విద్యార్థులను గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు లేదా అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించింది. తల్లిదండ్రులతో చర్చించి ఎక్కడ చేర్పించాలో నిర్ణయం తీసుకుంటాం- విజయ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు, పాడేరు

బీపీఎస్ పథకం రద్దు చేయడం దారుణమని దీనిపై ప్రభుత్వం పునః పరిశీలించాలని గిరిజన బాలల విద్యా హక్కుల కన్వీనర్ కృష్ణారావు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

విశాఖ ఏజెన్సీలో పోలీసుల ముమ్మర తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details