రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతవాసులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో జింక్ పరిశ్రమ ఏర్పాటుచేయాలని 1970వ సంవత్సరంలో నిర్ణయించారు. తీరంలో కర్మాగారం ఉంటే ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా ఉంటుందని తేల్చారు. అనుకున్నదే తడవుగా రాజస్థాన్‌లోని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ పరిశ్రమకు అనుబంధంగా ఒక కర్మాగారాన్ని విశాఖలో ఏర్పాటుచేయాలని తీర్మానించారు.
1971వ సంవత్సరంలో విశాఖ శివారు మింది, చుక్కవానిపాలెం, ఎదురువానిపాలెం, నక్కవానిపాలెం, ములగాడ గ్రామాల నుంచి 365 ఎకరాల భూములను సేకరించారు. 1974వ సంవత్సరంలో పనులు మొదలుపెట్టారు. వేగంగా పనులు పూర్తిచేసి 1977వ సంవత్సరం నుంచి ఉత్పత్తిని కూడా విశాఖ కర్మాగారంలో ప్రారంభించారు. సంస్థకు రాజస్థాన్‌లో గనులు ఉండడంతో ముడి సరకు మొత్తం రాజస్థాన్ నుంచే వచ్చేది. సంస్థ ఉత్పత్తికి అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను కూడా క్రమంగా పెంచారు. ఫలితంగా ఒకదశలో సుమారు రెండువేల మంది ఉద్యోగులు, మరో రెండువేల మంది వరకు ఒప్పంద కార్మికులు సంస్థలో పనిచేశారు. ప్రభుత్వరంగం సంస్థ కావడంతో ఉద్యోగులకు వేతనాలు కూడా భారీగా వచ్చేవి. ఉద్యోగుల కోసం వసతిగృహాలు, క్రీడాప్రాంగణాలు, వైద్యసదుపాయాలు, ఉద్యోగుల పిల్లల కోసం పాఠశాలలు, వసతిగృహాల్లో ఉండేవారు నగరంలోని మార్కెట్లో వస్తువులు కొనుగోలుచేయడానికి బస్సు సదుపాయాలూ తదితరాలన్నీ ఏర్పాటుచేశారు. సంస్థలో పనిచేయడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేలాది మంది ఆర్థికంగా స్థిరపడ్డారు. 1991వ సంవత్సరంలో ఆర్థిక సరళీకరణల తరువాత ఆ సంస్థలో పదిశాతం వాటాలను విక్రయించారు. ఆ విధంగా ప్రైవేటుకు సంస్థలో బీజాలు పడ్డాయి.
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో వాటాల విక్రయం మొదలుపెట్టడంతో ఆ సంస్థలో ప్రైవేటు వాటా 64.9శాతానికి చేరింది. అది మరింత పెరిగి కేంద్రప్రభుత్వవాటా 27శాతానికి పడిపోయింది. దీంతో మెజారిటీవాటా దక్కించుకున్న వేదాంత గ్రూపునకు చెందిన స్టెరిలైట్ సంస్థ పాలనపగ్గాలు చేపట్టింది. తరువాత కాలంలో సంస్థలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందంటూ స్వచ్ఛంధ పదవీవిరమణ పథకాన్ని అమలు చేశారు. క్రమంగా ఉద్యోగులను తగ్గించుకుంటూ వచ్చారు. రాజస్థాన్ నుంచి విశాఖ తీసుకొచ్చిన అధికారులను మళ్లీ రాజస్థాన్‌లోని కార్మాగారానికి పంపేశారు. చివరకు సంస్థలోని ఉద్యోగుల సంఖ్య 285కు చేరింది. సంస్థ ప్రారంభించిన నాటి నుంచి భారీ లాభాల్లోనే నడిచింది. కానీ రాజస్థాన్లో ఉన్న గనుల నుంచి ముడిఖనిజం తేవడం వ్యయభరితంగా మారుతోందంటూ 2012వ సంవత్సరంలో సంస్థలో ఉత్పత్తిని మూసేశారు. దీంతో పలువురు ఉద్యోగుల రోడ్డున పడ్డారు. విశాఖను వదిలి రాజస్థాన్ వెళ్లి ఉద్యోగం చేయడం ఇష్టంలేక పలువురు వి.ఆర్.ఎస్. తీసుకోగా, అతికొద్దిమంది మాత్రం తప్పని పరిస్థితుల్లో రాజస్థాన్‌కు వలస వెళ్లారు. చివరకు 2013వ సంవత్సరానికి సంస్థను మూసేశారు.
రూ.18వేల కోట్ల విలువైన భూములను ఏం చేస్తారో?
పరిశ్రమను ఏర్పాటుచేసి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి రైతుల నుంచి సేకరించిన భూములను ఇప్పుడు ఏంచేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం సుమారు రూ.18వేల కోట్ల వరకు పలికే ఆయా 365 ఎకరాల భూములను ఇతర అవసరాలకు వినియోగింకుండా విశాఖలోని పలు సంఘాలు అడ్డుకున్నాయి. రైతుల నుంచి సేకరించిన భూములను తిరిగి ఆయా రైతులకే ఇచ్చేయాలంటూ ‘జింక్ భూముల రైతుల పరిరక్షణ కమిటీ’ ఏర్పాటైంది.
నమ్మించి మోసం చేశారు.....
హిందుస్థాన్ జింక్‌ను ప్రైవేటీకరించినా ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదని నమ్మబలికారు. నాడు సంస్థలోని చాలామంది ఉద్యోగులు కేంద్రప్రభుత్వ మాటల్ని గుడ్డిగా నమ్మారు. వాటాల విక్రయం మొదలైన నాటి నుంచే ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సుమారు రెండువేల మంది వరకు ఉద్యోగులతో అలరారిన సంస్థలో ఉద్యోగుల సంఖ్య బాగా తగ్గిపోయింది. సంస్థ ఉద్యోగులకు చేసే ఖర్చులు తగ్గిపోయినా, భారీగా లాభాలు ఆర్జిస్తున్నా సంస్థను అడ్డగోలుగా మూసేశారు. చివరకు ఉద్యోగులు నిలువునా మోసపోయినట్లైంది. నాడు కేంద్రం సేకరించిన భూములను తిరిగి రైతులకే ఇచ్చేయాలని పోరాడుతున్నాం. లేదంటే అతితక్కువ ధరలకు ప్రైవేటు సంస్థలు ప్రభుత్వరంగ సంస్థల్ని కొనుగోలు చేసి ఆయా ఉద్యోగుల్ని తొలగించి భూముల్ని హస్తగతం చేసుకుంటాయి.- పిట్టా నారాయణమూర్తి, కన్వీనర్, జింక్ భూముల రైతుల పరిరక్షణ కమిటీ, విశాఖపట్నం
భూముల పైనే ప్రైవేటు సంస్థల కన్ను....
ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులపైనే ప్రైవేటు సంస్థలు కన్నేస్తున్నాయి. పరిశ్రమను నడుపుదామని, ఉద్యోగాలు కల్పించాలని, ఆయా ప్రాంతాల అభివృద్ధికి కృషిచేయాలన్న చిత్తశుద్ధి ఆయా ప్రైవేటు సంస్థలకు ఎందుకు ఉంటుంది? హిందుస్థాన్ జింక్‌ను కొనుగోలు చేసిన సంస్థ చివరకు విశాఖ కర్మాగారాన్ని మూసేసింది. సుమారు రూ.2లక్షల కోట్ల విలువైన ఉక్కు కర్మాగారం కూడా ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే వేలాది ఉద్యోగాలు గల్లంతవుతాయి. సంస్థను ఎంతకాలంపాటు నడుపుతారన్న విషయం కూడా వారిచేతుల్లోనే ఉంటుంది.-
- అజశర్మ, ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర వేదిక
ఇదీ చదవండి
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 14 మంది మృతి