ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నాటి విశాఖ పర్యటన సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పరుష పదజాలంతో దుర్భాషలాడి.. దౌర్జన్యం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఖండించింది. వెంటనే మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె. శ్రీనివాసరావు, కోశాధికారి ఎం. సోమశేఖర్‌రెడ్డి, విజయవాడ, పశ్చిమగోదావరి శాఖల అధ్యక్షులు ఎం.సోమయ్య, ఆర్.నాగేశ్వరరావు, కార్యనిర్వాహక సభ్యులు టి.పెద్దయ్య, కె.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి విచారణ చేయించి తగు చర్యలు తీసుకోవడంతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.
అసలేం జరిగింది..
seediri appala raju: పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విశాఖలోని శారదాపీఠం ముఖద్వారం వద్ద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బుధవారం ఉదయం మంత్రి అప్పలరాజు తన అనుచరులతో కలిసి చినముషిడివాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరయ్యారు. అప్పటికి ఇంకా సీఎం జగన్ రాలేదు. మంత్రి అప్పలరాజు పీఠం ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లేటప్పుడు ఆయనతో పాటు ఉన్న పలాస పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ పూర్ణచంద్రరావు, ఆయన అనుచరులను సీఐ రాజుల్‌నాయుడు అడ్డుకోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేయి వేసి ముందుకు తోశారు.