Titli cyclone Compensation : 2018 అక్టోబర్లో వచ్చిన తిత్లీ తుపాను ధాటికి.. రైతులు సర్వం కోల్పోయారు. నాటి తుఫాను ధాటికి కొబ్బరి, జీడిమామిడి రైతులు కుదేలయ్యారు. ఏపుగా ఎదిగిన కొబ్బరి చెట్లన్నీ కళ్లముందే నేలకొరిగాయి. జీడి చెట్లు కూకటివేళ్లతో సహా కుప్పకూలాయి. అన్నదాతలు తీరని నష్టం చవిచూశారు. అయితే.. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపోయిన రైతులకు అదనపు సహాయం అందిస్తామని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఇప్పటి వరకూ బాధిత రైతులకు ఒక్క రూపాయి పరిహారమూ అందలేదు.
"తిత్లీ" పరిహారం కోసం నేటికీ.. రైతుల ఎదురు చూపులు! - శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ ప్రభావం
Titli cyclone Compensation : తిత్లీ తుపాను ధాటికి సర్వం కోల్పోయిన రైతులు నేటికీ పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. 2018 అక్టోబర్ 10న దూసుకొచ్చిన ఈ తుపాను.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం రూపురేఖలు మార్చేసింది. తిత్లీ తుఫానుతో పంటలన్నీ ధ్వంసమయ్యాయి. అయితే.. అప్పటి పరిహారం.. ఇప్పటికీ అందకపోవడం గమనార్హం.
తిత్లీ ప్రభావం.. కంచిలి, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, పలాస, మందసతోపాటు మరో 9 మండలాల్లో తీప్రంగా కనిపించింది. 15 లక్షల 97వేల 559 కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. 56 వేల 8 వందల 10 ఎకరాల్లో జీడి పంట పూర్తిగా ధ్వంసమైంది. సుమారు ఆరువేల మంది రైతులు బాధితులయ్యారు. కాగా.. అప్పుడు తెదేపా హయాంలో సహాయం అందుకున్న రైతుల్లో అనర్హులు ఉన్నారని వైకాపా నేతలు ఆరోపణలు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కొన్ని పేర్లు తొలగించి, కొత్తవి చేర్చి జాబితా తయారు చేశారు. అది జరిగీ రెండు సంవత్సరాలు గడిచాయి. అయినా.. వారికీ నేటి వరకూ సహాయం అందలేదు. ఇప్పటికైనా తమకు పరిహారం అందజేసి ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించండి - తులసి రెడ్డి