ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ మరో ముందడుగు వేసింది. త్రీటైర్ ఏసీ ఎకానమీ కోచ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కోచ్‌లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐఎఫ్‌సీ, కపుర్తలలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆర్ఎఫ్సీలో తయారవుతాయి. చెన్నైలో తయారైన తొలి కోచ్‌ను విశాఖకు పంపారు. వీటిని లింక్‌హాఫ్‌మన్ బుష్చ్ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుగా ఉన్నతీకరించి ఆ తర్వాత థర్డ్ ఏసీ కొత్త కోచ్‌లుగా మార్చనున్నారు. మరిన్ని కోచ్‌లను కూడా ఇక్కడికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫైర్ ఫ్రూఫ్ సీట్లు..
కొత్త త్రీటైర్ ఏసీ ఎకానమీ కోచ్‌ల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. విలాసంగా కనిపించేలా సీట్లను డిజైన్ చేశారు. అగ్నిప్రమాదాలకు తావులేకుండా ఫైర్ ఫ్రూఫ్ సీట్లు ఏర్పాటు చేశారు. ప్రతీ సీటుకూ శీతల కవాటాలను పెట్టి.. అవసరం ఉన్నప్పుడు తెరిచేలా, అవసరం లేనప్పుడు మూసేలా ఏర్పాట్లున్నాయి. ప్రతీ సీటు దగ్గర ఛార్జింగ్ పాయింట్, అలాగే మొబైల్ హోల్డర్ ని ఉంచారు. అలాగే ప్రతీ సీటుకూ ఎల్ఈడీ రీడింగ్ లైట్‌ను ఉంచారు. గంటకు 160కిలోమీటర్ల అత్యధిక వేగాన్ని తట్టుకునేలా కోచ్‌లను రూపొందించారు. ఉన్నతీకరించిన అధునాతన డిజైన్‌తో ఈ కోచ్‌లు ప్రయాణికులను ఆకట్టుకుంటాయని అధికారులు అంటున్నారు.