ALLURI: ఉమ్మడి విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో 1897 జులై 4న అల్లూరి సీతారామరాజు జన్మించారు. బ్రిటిషర్లను దేశం నుంచి తరిమేయాలన్న ఆకాంక్షకు చిన్ననాడే బీజం పడింది. 11 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన అల్లూరి బంధువుల సహకారంతో కాకినాడ, తుని, నరసాపురం, విశాఖలో చదువు సాగింది. తర్వాత దేశమంతా పర్యటించి విద్య,వైద్యంలో నైపుణ్యం సాధించారు. ప్రజాసేవతో గిరిజనుల్ని పోరాటానికి సన్నద్ధం చేశారు. గిరిజనుల నుంచి విలువిద్య, పోలీసుల ద్వారా తుపాకీ పేల్చడం నేర్చుకున్నారు. 150 మంది గిరిజన వీరులను తయారుచేసి 1922 ఆగస్టు 22న చింతపల్లి పొలీస్‌స్టేషన్‌పై తొలి దాడి చేశారు. ముందే సమాచారం ఇచ్చి మరీ ముట్టడించడం బ్రిటిషర్లను హడలెత్తించింది. రెండోరోజు కృష్ణదేవిపేట, మూడోరోజు రాజవొమ్మంగి స్టేషన్లపై దాడిచేశారు.
ఆయుధాలు స్వాధీనం చేసుకుని మరీ.. లెక్కరాసి సంతకం చేసిన తెగువ సీతారామరాజుది. బ్రిటిష్ అధికారులతో.. ఆరుసార్లు ముఖాముఖి తలపడ్డారు. ఆరుసార్లూ అల్లూరి దళాలదే విజయం. అడ్డతీగల, రంపచోడవరం స్టేషన్లపైనే దాడి చేసినా.. ఆయుధాలు దొరకలేదు. వీరిని పట్టుకునేందుకు రూథర్‌ఫోర్డ్ నేతృత్వంలో సాయుధ దళాలు మన్యం చేరుకున్నాయి. తాను లొంగిపోతే.. తననే నమ్ముకున్నవారి నిర్భందం తగ్గుతుందని.. సీతారామరాజు భావించారు. 1924 మే 7న విశాఖ జిల్లా కొయ్యూరు వద్ద మంపవాగులో స్నానం చేస్తూ.. పోలీసులకు తన ఆచూకీ చెప్పాలంటూ.. పశువుల కాపరిని పంపారు. క్షణాల్లో చుట్టుముట్టిన పోలీసులు.. రాజేంద్రపాలెంలోని సైనిక శిబిరానికి తీసుకొచ్చారు. సీతారామరాజును మేజర్ గుడాల్ అనే అధికారి చింతచెట్టుకు కట్టేసి ప్రశ్నించాడు. బ్రిటిషర్లు దేశాన్ని విడిచివెళ్లేవరకు పోరాడుతానన్న సమాధానంతో.. అల్లూరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వందేమాతరం అంటూ.. ఆ మహనీయుడు నేలకొరిగారు. కృష్ణదేవిపేట వద్ద తాండవ నది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు.