Professor Shanthamma: ఈ పెద్దావిడ పేరు శాంతమ్మ.. వయస్సు 95 ఏళ్లు.. ఈ వయస్సులో మోకాళ్ల నొప్పులు సహజమే కదా.. అందుకే ఈమె రెండు మోకాళ్లకు ఆపరేషన్ చేశారు.. అయినా.. ఆమె చేతి కర్రల సాయంతో నడక సాగిస్తున్నారు. మరి చేతి కర్రలు పట్టుకుని మరీ.. ఈమె ఎక్కడకు వెళ్తున్నారు.. ఏ ఆసుపత్రికో.. అనుకుంటున్నారా.. కాదు.. ఎక్కడికో మీరే చూడండి.
అవును.. మీరు చూస్తున్నది నిజమే.. 95 ఏళ్ల శాంతమ్మ వెళ్లింది తరగతిగదిలోకే... ఇది విజయనగరంలోని సెంచూరియన్ యూనివర్శిటీ.. ఇక్కడ ప్రొఫెసర్ శాంతమ్మ.. మెడికల్ ఫిజిక్స్, రేడియాలజీ, అనస్థీషియా వంటి అంశాలు బోధిస్తున్నారు.
విశాఖకు చెందిన తిరుకూరి శాంతమ్మ.. ఏవీఎన్ కళాశాలలో ఇంటర్, ఆంధ్రావర్శిటీలో హనర్స్, ఎంఎస్సీ పూర్తిచేశారు. పరిశోధన తర్వాత.. సరిగ్గా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన.. 1947 వ సంవత్సరంలో.. అదే ఆంధ్రా విశ్వవిద్యాలయంలో... అధ్యాపకురాలిగా చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ శాంతమ్మ బోధన, పరిశోధన నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.
శాంతమ్మ.. విద్యార్ధి దశలోనే.. బ్రిటన్ రాయల్ సొసైటీ ఆచార్యుల పరిశీలనలో డాక్టర్ ఆఫ్ సైన్స్ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. స్పెక్ట్రోస్కోపీలో విశేషమైన పరిశోధనలు చేసి.. ప్రయోగశాలలను అభివృద్ధి చేసిన డాక్టర్ రంగధామారావు మార్గదర్శనంలో పరిశోధనలు చేశారు. లేజర్ టెక్నాలజీ, పెట్రోల్‌లో మలినాలు గుర్తింపు వంటి అనేక అనేక ప్రాజెక్టుల్లో శాంతమ్మ పరిశోధనలు చేశారు. అనేక పరిశోధన పత్రాలు ముద్రించారు. అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియాలోని అనేక వర్శిటీలు శాంతమ్మను ఆహ్వానించి అనుభవాలు తెలుసుకున్నాయి. శాంతమ్మ మార్గదర్శకత్వంలో 17 మంది వరకూ పీహెచ్డీ పూర్తి చేశారు.
భౌతిక శాస్త్ర విభాగం ఆచార్యులుగా 1989లోనే పదవీవిరమణ పొందినా... శాంతమ్మ బోధన మాత్రం కొనసాగుతూనే ఉంది. అప్పటి ఏయూ వీసీ సింహాద్రి.. గౌరవ వేతనంపై ఆమెను ప్రొఫెసర్‌గా కొనసాగించారు. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన జీఎస్ఎన్ రాజు కూడా శాంతమ్మను ప్రొఫెసర్ కొనసాగించారు. విశేషం ఏంటంటే.. జీఎస్ఎన్ రాజు.. శాంతమ్మ ప్రియ శిష్యుడే.
" సుమారు 50 సంవత్సరాల క్రితం మా బ్యాచ్‌కు ఫిజిక్స్ బోధించారు. వందకు 70 మార్కులు రావడం కష్టం ఆవిడ పేపర్లో. అలాంటిది నాకు నూటికి 94 నాలుగు వచ్చాయి. అప్పటి నుంచి మేడంకు నేను ప్రియ శిశ్యుణ్ణి అయ్యాను. మేడం కూడా నాకు ఫేవరెట్ గురువయ్యారు. నేను వీసీ అయిన తర్వాత ఆంధ్ర వర్సిటీలో మూడేళ్లు పని చేశాను. అక్కడ కూడా మేడం పని చేశారు. ఇక్కడికి వచ్చాక కూడా మేడం రోజూ పాఠాలు చెప్పడం, పేపర్స్ పబ్లిష్ చేయడం ఇలా యంగ్ స్టాఫ్‌కు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు."-జి.ఎస్.ఎన్.రాజు, సెంచూరియన్ వర్శిటీ వీసీ