Azadi ka Amrit Mahotsav : మహారాష్ట్ర థానేలోని కల్వ అనే ప్రాంతానికి చెందిన రమాకాంత్ మహాదిక్‌కి 68ఏళ్లు. ఎల్ అండ్ టీలో ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. భార్య, ఒక కుమార్తె ఉన్నారు. సైక్లింగ్ అంటే అత్యంత ఇష్టం. పర్వతారోహకుడు కూడా. సహ్యాద్రి, హిమాలయ పర్వతాలను అధిరోహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా తన వంతుగా ఏదైనా చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా 6,800 కిలోమీటర్ల సైకిల్ యాత్రను ఆరంభించారు. గతేడాది జనవరి 26న కోటేశ్వర్ కచ్ నుంచి రాజస్థాన్‌లోని హెల్మిటాప్‌వార్ మెమోరియల్ వరకు 4 వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి.. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన సైనికులకు నివాళి అర్పించి ఆ యాత్రను వారికి అంకితం చేశాడు. తన ప్రయాణంలో భాగంగా ఆయన విశాఖ చేరుకుని.. సైకిల్ యాత్ర విశేషాలను తెలియజేశారు.
రోజుకు కనీసం 150 కిలోమీటర్లు..
Ramakant Mahadik cycle journey : ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన కోటేశ్వర్ కచ్ నుంచి బయలుదేరి.. కన్యాకుమారి మీదుగా కోల్‌కతాకు సైకిల్‌పై చేరుకుని.. అక్కడి నుంచి విమానం ద్వారా అండమాన్‌లోని సెల్యులార్ జైలు వద్దకు ఫిబ్రవరి 26న చేరుకోవాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు, వీర్ సావర్కర్ వర్ధంతి సందర్భంగా.. నివాళులు అర్పించడం కోసం యాత్ర చేపట్టినట్టు రమాకాంత్ మహాదిక్ వెల్లడించారు. రోజుకు కనీసం 150 కిలోమీటర్లు ప్రయాణిస్తూ.. వివిధ ప్రాంతాల వ్యక్తులను కలిసి ఆరోగ్యకరమైన జీవితానికి అనుసరించాల్సిన పద్ధతులను వివరిస్తున్నట్లు చెప్పారు.