ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ భూ కుంభకోణంలో సూత్రధారి, పాత్రధారి.. అంతా అ‘ధర్మాన’ పర్వం - ఒక్కొక్కటిగా బయటపడుతున్న ధర్మాన గారి భూ దందా

Dharmana Prasada Rao: విశాఖ భూకుంభకోణానికి కర్త, కర్మ, క్రియ సర్వం ధర్మానే. భూములు కొల్లగొట్టడంలో సూత్రధారి, తనవారికి కట్టబెట్టడంలో పాత్రధారీ కూడా ఆయనే. భూకుంభకోణంపై సిట్‌ నివేదికను క్షుణ్నంగా పరిశీలిస్తే... పక్కా స్కెచ్‌ వేసి మరీ అసైన్డ్ భూముల్ని ఎలా కొట్టేశారో అర్థమవుతుంది. పేదల బాగుకు పాటుపడుతున్నట్లు పదే పదే ధర్మపన్నాలు వల్లించే ధర్మాన... ఆ పేదలకు ఇచ్చే అసైన్డ్ భూముల్ని కాజేయడమే వైచిత్రి. పేదల పేరిట పట్టాలు తయారుచేసి, వందల కోట్ల విలువైన భూముల్ని దోచేసినట్లు, సిట్‌ నిగ్గు తేల్చింది.

Dharmana Prasada Rao
ధర్మాన గారి భూ దందా

By

Published : Oct 16, 2022, 7:30 AM IST

Dharmana land scam in Vishaka: మాజీ సైనిక ఉద్యోగుల నుంచి భూములు కొన్నది రెవెన్యూమంత్రి ధర్మాన, ఆయన కుటుంబం కావడం వల్లే... ఈ దందా సాఫీగా సాగిపోయిందని నిర్ధారించింది. అంటే... ఈ దోపిడీలో సూత్రధారి, పాత్రధారే కాదు.. లబ్ధిదారు కూడా ధర్మానే అని తేటతెల్లమవుతోంది. విశాఖ భూకుంభకోణంపై ఐఎఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వం నియమించిన సిట్‌... సుదీర్ఘ విచారణ తర్వాత నివేదిక రూపొందించింది. ఈ నివేదికను చూస్తే... రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు భూదోపిడీపై విస్తుగొలిపే విషయాలు బయటపడతాయి. బకాసురుల్లా భూముల్ని మింగేయడంలో భాగమైన అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తులు, భూములు రిజిస్టర్‌ చేయించుకున్న వ్యక్తులను సిట్‌ బృందం ప్రశ్నించింది. విచారణ ఎదుర్కొన్న వారంతా ధర్మాన సన్నిహితులు, బంధువులే ఉన్నారు. వీరంతా మూకుమ్మడిగా చెప్పిన మాట ఒకటే. ధర్మాన ప్రసాదరావు చెప్పినట్లు చేయడం తప్ప.. ఇతర విషయాలేవీ తమకు తెలియవని ముక్తకంఠంతో చెప్పారు.

ప్రభుత్వానికి చెందిన ఈ భూములు అమ్ముకునేందుకు సామాన్యులు ఎవరైనా దరఖాస్తు చేస్తే అధికారులు అస్సలు అనుమతిచ్చి ఉండేవారు కాదని సిట్‌ స్పష్టంచేసింది. మాజీ సైనిక ఉద్యోగుల నుంచి కొంటున్నది సాక్షాత్తూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబసభ్యులు, స్నేహితులు కావడం వల్లే అధికారులు అనుమతులు మంజూరు చేశారని సిట్‌ కుండబద్దలు కొట్టింది. పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలో సైనికోద్యోగులకు చెందిన 34.56 ఎకరాల భూముల్ని మంత్రి ధర్మాన అండ్‌ కో కొట్టేసింది. ఈ భూములు పొందిన వారిలో కొందరు మాజీ సైనికోద్యోగులు అనడానికి ఆధారాల్లేవని సిట్‌ తేల్చింది. అర్హత లేకపోయినా జూనియర్‌ కమిషన్డ్‌ స్థాయి సైనికాధికారికీ ప్రభుత్వ భూమి కేటాయించినట్లు స్పష్టంచేసింది. ఎసైనీల వద్ద అసలైన డీఫాం పట్టాలు కూడా దొరకలేదు. ఈ అక్రమాలు జరిగిన రోజుల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి కూడా ధర్మానే. విశాఖ శివార్లలో నకిలీ డీఫాం పట్టాలతో భూముల అమ్మకానికి అనుమతులు తెచ్చుకుంటున్నారని, జాగ్రత్త వహించాలని సబ్‌ రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. అనేక కేసుల్లో కలెక్టర్‌ నుంచి భూమి విక్రయానికి ఎన్ఓసీలు రాకముందే.. సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు.

విశాఖ గ్రామీణ మండలం మధురవాడ సర్వే నెంబర్ 355/4లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి ధర్మాన కుటుంబం సొంతమైంది. మాజీ సైనిక ఉద్యోగి మాదాబత్తుల అప్పారావు పేరిట ఇచ్చిన డీఫాం భూమి అమ్మకానికి నిరభ్యంతర పత్రం ఇప్పించి, ఆ తర్వాత వాళ్లే కొన్నారు. ఈ భూమి ధర్మాన కుటుంబం హస్తగతం చేసుకోవడానికి ముందు... గుబ్బల గోపాలకృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ధర్మాన కుటుంబ కంపెనీలో డైరక్టర్‌గా ఉన్న ఐ.బీ. కుమార్‌కు గోపాలకృష్ణ స్వయానా మామ. మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పడం వల్లే భూమి కొన్నట్లు సిట్‌కు గోపాలకృష్ణ వాంగ్మూలం ఇచ్చారు. 2005 నవంబర్‌లో కుమార్‌తో కలిసి వచ్చిన ధర్మాన సోదరుడు రామదాస్, బంధువు జోగినాయుడు... మధురవాడలో తన పేరిట కొంత భూమి కొంటామంటే ఒప్పుకోలేదని సిట్‌కు వివరించారు. ఆ వెంటనే ఫోన్‌లో తనతో మాట్లాడిన మంత్రి ధర్మాన.... కొన్నాళ్లు మాత్రమే భూమి మీ పేరుతో ఉంటుందని నచ్చజెప్పడంతో అంగీకరించినట్లు చెప్పారు.

జోగినాయుడు దగ్గరుండి జీ.పీ.ఏ కం సేల్‌ అగ్రిమెంట్‌ చేయించారని, రకరకాల కాగితాలపై తనతో సంతకాలు చేయించుకున్నారని సిట్‌కు తెలియజేశారు. ఆ తర్వాత మరోరోజు వైకుంఠరావు అనే ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ను ధర్మాన తన వద్దకు పంపించినట్లు చెప్పారు. భూముల లాభాల్లో వాటా పంచుకున్నట్లు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసుతోపాటు తన పేరిట డీడీలు రూపొందించినట్లు పేర్కొన్నారు. 2006, 2007లో మరోసారి ధర్మాన ప్రసాదరావు సూచనతో లంకెలపాలెంలో తమ పేరిట కొంత భూమి రిజిస్టరవగా.. తర్వాత దాన్ని ఆయన కుమారుడు రామ్‌మనోహర్‌నాయుడికి చెందిన ఓంకాన్‌ కంపెనీకి బదిలీ చేసినట్లు తెలిపారు. ఆ సమయంలోనే 700 చదరపు గజాల స్థలం ధర్మాన భార్య లక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్‌ అయిందన్నారు. ఓంకాన్‌లో డైరెక్టర్లుగా ఉన్న ధర్మాన రామదాసు మంత్రి ధర్మానకు సోదరుడు కాగా...ఏవీకే జోగినాయుడు, రవి సన్నిహిత అనుచరులు. వారు అందులో లేఅవుట్‌ వేసి విక్రయించారు. అప్పట్లో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ప్రమేయంతోనే ఈ భూమికి ఎన్ఓసీ అతి త్వరగా వచ్చినట్లు సిట్‌ తేల్చింది. ఈ వ్యవహారంలో ధర్మాన ప్రసాదరావు ప్రమేయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సిఫార్సు చేసింది. మాజీ సైనిక ఉద్యోగుల డీఫాం భూములకు ఎన్ఓసీలు ఇవ్వాలని...అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్వయంగా కలెక్టర్‌కు సిఫార్సు లేఖలు రాశారు.

మాజీ సైనికోద్యోగి పల్లా సింహాచలం డీఫాం భూమి అమ్మకానికి ఎన్ఓసీ దరఖాస్తును సిఫార్సు చేస్తూ.. 2008 మే 28న కలెక్టర్‌కు మంత్రి ధర్మాన లేఖ పంపారు. కింతాడ అప్పారావుతో పాటు మరో నలుగురు మాజీ సైనికోద్యోగుల భూముల విక్రయానికి వీలుగా ఎన్ఓసీ ఇవ్వాలనే ఫైళ్లను ఒకే రోజున జిల్లా అధికారులకు పంపారు. అవన్నీ ఒకే ప్రొఫార్మాలో ఉన్నాయని, నిరభ్యంతర పత్రాలు మంజూరు చేయాలని 2008 నవంబర్ 12న తన లెటర్‌హెడ్‌పై ధర్మాన ఎండార్స్‌ చేసినట్లు సిట్‌ తేల్చింది. విశాఖ జిల్లా పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలో మాజీ సైనికోద్యోగులు ఎ.ఎస్.ఆర్. కే.కే. కుమార్, ఆర్.రామచంద్రరావు, ఎన్.చంద్రరావు పేర్లతో.. సర్వే నెంబర్ 360/3లో 3.14 ఎకరాలు, 361/2లో 3.85 ఎకరాలు, 367/1లో 2.82 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. ఈ మాజీ సైనికోద్యోగుల్లో ఇద్దరు ఎక్కడున్నారో సిట్‌ గుర్తించలేకపోయింది. ఎ.ఎస్.ఆర్. కే.కే. కుమార్‌ తనకు చెందిన 3.14 ఎకరాల భూమిపై హక్కును.. 2008 అక్టోబరు 14న జీపీఎ రూపంలో కోరమాండల్‌ ఎస్టేట్స్‌ ప్రతినిధి, ఐ.బీ కుమార్‌ భార్య జి.ప్రసన్నకు బదలాయించారు. 3.85 ఎకరాల భూమిని బండి సందీప్‌కు రౌతు రామచంద్రరావు అమ్మగా... ధర్మాన ప్రసాదరావు సన్నిహితులు డైరెక్టర్లుగా ఉన్న కోరమాండల్‌ ఎస్టేట్స్‌ 2008 జులై 25న కొనుగోలు చేసింది. ఇక నక్కా చంద్రరావు పేరిట ఉన్న 2.82 ఎకరాల భూమి తొలుత జి.ప్రసన్నకు బదిలీ అయింది. ఆ తర్వాత ఓంకాన్‌ రియల్టర్స్‌ ప్రతినిధి, ధర్మాన సన్నిహితుడు S.రవికుమార్‌కు అమ్మారు. అప్పటి విశాఖ జేసీ, వీరభద్రయ్య, పరవాడ తహసీల్దార్‌ ధర్మారావు, సబ్‌రిజిస్ట్రార్‌.. కొనుగోలుదారులతో కుమ్మక్కైనట్లు సిట్‌ తేల్చింది. వీరిపై క్రిమినల్‌ చర్యలకు సిఫారసు చేసింది.

విశాఖకు చెందిన వాసుపల్లి సత్తెయ్య అనే మాజీ సైనికోద్యోగికి... 1978లో గ్రామీణ మండలం బోరవానిపాలెం సర్వే నెంబర్ 187/1లో అసైన్‌మెంట్‌ కింద 4.89 ఎకరాలు ఇచ్చారు. వీటిపైనా సిట్‌ సందేహాలు వ్యక్తంచేసింది. 1983 డిసెంబర్‌ 1న సత్తెయ్య పదవీ విరమణ చేయగా, 1978 జూన్ 5వ తేదీనే ఆయనకు భూమి అసైన్‌ చేసినట్లు డీఆర్ దస్త్రం ఉంది. ఈ భూమి అమ్మకానికి నిరభ్యంతర పత్రం కోసం సత్తయ్య భార్య కుర్లమ్మ 2011 మార్చి 16న విశాఖ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అధికారులు హడావుడిగా పని పూర్తిచేసి, 2 నెలల్లోనే మే 15న ఎన్ఓసీలు ఇచ్చేశారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే ఇందులో 3 ఎకరాలు ధర్మాన సోదరుడు రామదాస్‌ కంపెనీ కోరమాండల్‌ ఎస్టేట్స్‌ పేరిట రిజిస్టరైంది. 2015లో అదే భూమిని కోరమాండల్‌ నుంచి ధర్మాన కుమారుడు రామ్‌మనోహర్‌కు చెందిన వర్జిన్‌ రాక్‌ కంపెనీ కొనింది. ఆ భూములు తాకట్టు పెట్టి 5 కోట్ల రుణం కూడా తీసుకుంది. 2002కు ముందు తన భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడే వాయిదాల పద్ధతిలో కోటి రూపాయలు చెల్లించే ఒప్పందంపై కోరమాండల్‌ కంపెనీకి అమ్మేసినట్లు సిట్‌కు కుర్లమ్మ తెలిపారు.

2011 ఏప్రిల్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీతారామ్‌... కుర్లమ్మ భూమి గురించి తనకు చెప్పినట్లు ధర్మాన సన్నిహితుడు ఐ.బీ కుమార్‌ సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. 4.89 ఎకరాల్లో 1.89 ఎకరాలు తాను కొంటానని, మిగతా 3 ఎకరాలు ధర్మాన తనయుడు రామ్‌మనోహర్‌కు చెందిన వర్జిన్‌ రాక్‌ కొనేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. అక్కడ మైనింగ్‌ స్టాక్‌ యార్డు ఏర్పాటుకు యత్నిస్తున్న ఆ సంస్థకు అనుమతులు రావాలంటే సమయం పడుతుందని.. అందువల్ల తొలుత కుర్లమ్మ నుంచి కోరమాండల్‌ ద్వారా భూమి కొనాలని సూచించినట్లు చెప్పారు. అనంతరం కోరమాండల్‌ నుంచి ధర్మాన తనయుడి కంపెనీ వర్జిన్‌ రాక్‌ కొంటుందన్నారు. ఆ భూమికి ఎన్ఓసీలు లేదని చెప్పగా.. 2011 మే నెలలో వచ్చినట్లు సీతారామ్ చెప్పారని వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ తర్వాత కుర్లమ్మ నుంచి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ, అమ్మకం ఒప్పందం చేసుకుని.. వర్జిన్‌ రాక్‌కు ఇచ్చేలా పొందుపరిచామన్నారు. 2015లో తమ నుంచి ఆ భూమిని వర్జిన్‌రాక్‌ కొన్నట్లు తెలిపారు.

పరవాడ మండలం పెదముషిడివాడ సర్వే నెంబర్ 437/1లో 5.14 ఎకరాల డీఫాం భూమి అమ్మకానికి.. నిబంధనలు తుంగలో తొక్కి మాజీ సైనికోద్యోగి పల్లా సింహాచలం పేరిట అనుమతి పత్రాలిచ్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 22A జాబితా నుంచి భూముల్ని కలెక్టర్‌ తొలగించారని సిట్‌ తేల్చింది. వీటిని తొలుత కోరమాండల్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి జి.ప్రసన్న కొన్నారు. ఆమె ధర్మాన సన్నిహితుడు ఐ.బీ కుమార్‌ భార్య. ఆ తర్వాత అందులో కొంత భూమిని ధర్మాన స్నేహితులు గోవింద సత్యసాయి, జాస్తి భాస్కరరావు, మరో బంధువు కొనుగోలు చేశారు. ఈ భూమికి ఎన్ఓసీలు జారీ చేసేటప్పుడు.. అంతకుముందు జరిగిన అక్రమాల్ని పరిగణనలోకి తీసుకోలేదని సిట్‌ తేల్చింది. డి.పట్టా కోసం దరఖాస్తు, ఒరిజినల్‌ డీఫాం పట్టాలు కూడా దర్యాప్తు బృందానికి దొరకలేదు. ఎసైన్‌మెంట్‌ రిజిస్టర్‌లో లోటుపాట్లున్నా.. ప్రభుత్వ భూమి అమ్మకానికి అప్పటి కలెక్టర్‌ శ్యామలరావు అనుమతులు ఇచ్చేశారు. రెవెన్యూ మంత్రి ప్రమేయంతోనే ఇదంతా జరిగినట్లు సిట్‌ నిర్ధరించింది.

దేశపాత్రునిపాలెంలో ధర్మాన అండ్‌ కో 11 మంది విశ్రాంత సైనికోద్యోగులకు చెందిన 34.56 ఎకరాల భూముల్ని... నిబంధనలకు విరుద్ధంగా దక్కించుకున్నట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. అధికార బలంతో ఎన్ఓసీలు ఇప్పించి, ఆ తర్వాత ధర్మాన సోదరుడు రామదాస్, కుమార్‌ వంటి సన్నిహితులు డైరెక్టర్లుగా ఉన్న ఓంకాన్‌ రియల్టర్స్, కోరమాండల్‌ ఎస్టేట్స్‌ సంస్థలు కొట్టేశాయి. అప్పట్లో జిల్లా రెవెన్యూ అధికారి S.సత్యనారాయణ ఇన్‌ఛార్జి జేసీగా ఉన్న కొన్ని రోజుల్లోనే, 9 భూములకు ఎన్ఓసీలు ఇచ్చేశారు. అనతంరం జేసీగా వచ్చిన, వీరబ్రహ్మయ్యకు మరో రెండు ఎన్ఓసీలు జారీ చేశారు. ఈ భూములన్నీ ధర్మాన సోదరుడు, సన్నిహితుల కంపెనీలు కొనేశాయి. పాత రికార్డులు లేకున్నా, డీఫాం భూముల కేటాయింపుల్లో తప్పులున్నా.. వాటి అమ్మకానికి పరవాడ తహశీల్దార్, విశాఖ ఆర్డీఓ అనుమతులిచ్చేశారని సిట్‌ పేర్కొంది. కలెక్టర్‌కు మాత్రమే ఎన్ఓసీలు ఇచ్చే అధికారం ఉన్నా.. నిబంధనలు గాలికొదిలేసి ఇన్‌ఛార్జి జేసీ హోదాలోని ఆర్డీఓ, ఆ తర్వాత వచ్చిన జేసీ ఇచ్చారని స్పష్టంచేసింది.

2006లో మొత్తం 15 భూములకుఎన్ఓసీల కోసం రెవెన్యూ అధికారులకు సబ్బవరం సబ్‌రిజిస్ట్రార్‌ లేఖలు రాశారు. అందులో 11 భూములకు మాత్రమే అనుమతులు వచ్చాయి. ధర్మాన సంబంధీకులు లబ్ధి పొందిన వాటికి అనుమతులు ఇచ్చేసి, ఇతరులు కొన్న మిగతా నాలుగు స్థలాలకు క్లియరెన్స్‌ రాలేదని సిట్‌ అభిప్రాయపడింది. మాజీ సైనికోద్యోగి వడ్డాది సన్యాసిరావు పేరుతో 1992లో పరవాడ మండలం పెదముషిడివాడలో సర్వే నెంబర్ 441/1లో 4.65 ఎకరాల భూమి కేటాయించారు. ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం సృష్టించి నిరభ్యంతరపత్రం జారీ చేశారు. వీటిని 22ఎ నుంచి తొలగించడానికి ముందే మంత్రి సోదరుడు రామదాసు భాగస్వామిగా ఉన్న కోరమాండల్‌ ఎస్టేట్స్ కొనేసింది. అనంతరం ఆ భూములు ధర్మాన కుమారుడు రామ్‌మనోహర్‌ కంపెనీలోని ఇద్దరు మనుషులకు, కొంత భూమి ధర్మాన బంధువుకు విక్రయించారని సిట్‌ నిగ్గుతేల్చింది. 22ఎ నుంచి తొలగించడానికి 5 నెలల ముందే ఈ భూములు చేతులు మారిపోయాయి. వీటికి సన్యాసిరావు పేరుతో 1996 జూన్‌లో తహసీల్దార్ సుబ్బారావు సంతకంతో పట్టాదారు పుస్తకం జారీ చేశారు. అప్పట్లో అక్కడ తహసీల్దార్‌గా తాను పనిచేయలేదని, సంతకం తనది కాదని సిట్‌కు సుబ్బారావు చెప్పారు.

పేదవాడి కోటాలో సన్యాసిరావుకు పట్టా ఇచ్చానే తప్ప, పాసు పుస్తకం ఇవ్వలేదని 1991 నుంచి 94 మధ్య తహసీల్దార్‌గా చేసిన ప్రసాదరావు కూడా వాంగ్మూలం ఇచ్చారు. డీపట్టా భూమిని 2008లో మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరికి తన భర్త అమ్మారని... దీనిపై ప్రశ్నిస్తే తాగిన మైకంలో ఇచ్చేసినట్లు చెప్పారని సన్యాసిరావు భార్య సిట్‌కు తెలిపారు. అవతల మంత్రి, ఉన్నతవర్గాల వాళ్లు ఉండటంతో మాట్లాడలేకపోయినట్లు ఆ తర్వాత చెప్పారన్నారు. సన్యాసిరావుకు పట్టా ఇచ్చే సమయానికి సైనికోద్యోగిగా విధుల్లోనే ఉన్నారని తేలింది. ఈ వ్యవహారంలో అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాత్రపై దృష్టి సారించాలని సిట్ సిఫారసు చేసింది. అలాగే అప్పటి పరవాడ తహసీల్దార్ బండి వెంకటేష్, ఆర్డీఓ కె.ప్రభాకర్‌రావు, డి.వెంకటరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని సూచించింది. 22A నుంచి తొలగించకముందే 2009లో రిజిస్టర్‌ చేసినందుకు అప్పటి లంకెలపాలెం సబ్‌రిజిస్ట్రార్‌పై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసింది. మాజీ సైనికోద్యోగుల కోటా కింద 1993లో పరవాడ మండలం పెదముషిడివాడ సర్వే నెంబర్‌ 437/1లో, సత్యాడ అప్పారావుకు ప్రభుత్వం 3.95 ఎకరాలు కేటాయించింది. వాటి విక్రయ అనుమతి కోసం ఆయన దరఖాస్తు చేయగా.. 2009 నవంబర్ 11న ఎన్ఓసీ జారీ చేశారు. వెంటనే భూముల్ని కోరమాండల్‌ సంస్థకు విక్రయించారు. 2010లో ధర్మాన ప్రసాదరావు స్నేహితులు పి.నాగేంద్రబాబు ఎకరం భూమిని, జాస్తి భాస్కరరావు 0.46 ఎకరాల భూమిని కోరమాండల్‌ నుంచి కొన్నట్లు సేల్‌ డీడ్‌ రిజిస్టర్‌ చేయించుకున్నారు.

ఎన్ఓసీ వచ్చాక ఎకరానికి 8 లక్షల చొప్పున ఇచ్చారని.. మిగిలిన పనులన్నీ వాళ్లే చేసుకున్నారని సత్యాడ అప్పారావు సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. ఈ భూమి కొన్న కోరమాండల్‌ ఎస్టేట్స్‌... ఆ తర్వాత ధర్మాన బంధువు జి.మధుసూదన్‌రావుకు, ధర్మాన కుమారుడి సంస్థ డైరెక్టర్‌గా ఉన్న ప్రసన్న కొన్నారు. చివరికి ధర్మాన సన్నిహితులు భాస్కరరావు, ఈశ్వరరావు కొనుగోలు చేశారు. విశాఖ జిల్లా లంకెలపాలేనికి చెందిన కింతాడ అప్పారావు.. సైన్యంలో పనిచేస్తుండగానే మాజీ సైనికోద్యోగి కోటాలో ముషిడివాడలో 3.29 ఎకరాలు కేటాయించారు. ఆ తర్వాత ఎన్ఓసీలు ఇప్పించారు. అనంతరం మంత్రి సోదరుడికి చెందిన కోరమాండల్‌ ప్రాపర్టీస్‌ పేరుతో చేజిక్కించుకున్నారు. ఎన్ఓసీ జారీలో మంత్రి ధర్మాన ప్రమేయం ఉన్నట్లు సిట్‌ నివేదికలో పేర్కొంది.

భూమి అమ్మకానికి ఎన్ఓసీలు ఇచ్చేందుకు తహసీల్దార్, ఆర్డీవో సిఫారసు చేశారంటూ.. 2009 నవంబర్ 21న రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శికి జిల్లా కలెక్టర్‌ లేఖ రాశారు. కింతాడ అప్పారావు, వి.సన్యాసిరావు సర్వీసులో ఉండగా అసైన్డ్ భూమి పొందారని వివరించారు. ఎసైన్‌మెంట్‌ చేసిన పదేళ్ల తర్వాత మాజీ సైనికోద్యోగులు తమ భూములు అమ్ముకోవచ్చని.. ప్రభుత్వం ఆయనకు తెలిపింది. ఈ దస్త్రాన్ని అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు పంపారు. పట్టా ఇచ్చి పదేళ్లయిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్ఓసీ ఇవ్వాలని.. సైనికోద్యోగుల పదవీ విరమణ కాలాన్ని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదని మంత్రి సిఫార్సు చేశారు. ఆ తర్వాత ఆ భూములను మంత్రి కుటుంబసభ్యులే చేజిక్కించుకున్నారు. ఈ విషయమై అప్పటి కలెక్టర్‌ జె.శ్యామలరావును సిట్‌ ప్రశ్నించగా, ఎన్ఓసీ సమయంలో డీఫాం పట్టా ఇచ్చేందుకు అర్హత ఉందా లేదా అని పరిశీలించే ప్రక్రియ ఏదీ లేదని జవాబిచ్చారు.

ఒక్కొక్కటిగా బయటపడుతున్న ధర్మాన గారి భూ దందా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details