ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దారుణం: పింఛను సొమ్ము కోసం కన్నతల్లిని చంపిన కర్కశుడు - విశాఖ క్రైమ్ వార్తలు

మద్యానికి బానిసైన కుమారుడు కన్నతల్లిని డబ్బుకోసం హింసించాడు. అది తట్టుకోలేని ఆ మాతృమూర్తి వృద్ధాశ్రమంలో చేరింది. ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య పింఛను డబ్బులను కూడబెట్టుకుంది. ఆపదలో అక్కరకొస్తాయని భావించింది. అయితే అదే సొమ్ము తన ప్రాణాలు తీస్తుందని ఆ తల్లి గ్రహించలేకపోయింది. 3ఏళ్ల తర్వాత తనను చూడడానికి వచ్చిన బిడ్డను చూసి మురిసిపోయింది. అయితే ఆ కర్కశుడు ప్రేమతో రాలేదని, డబ్బుకోసం తనను చంపడానికి వచ్చాడని ఊహించలేకపోయింది. పింఛను డబ్బు కోసం కన్నకొడుకు చేతిలోనే హత్యకు గురైంది. ఈ హృదయ విదారక ఘటన విశాఖలో జరిగింది.

son killed mother for pention money in vizag
పింఛను సొమ్ము కోసం కన్నతల్లిని చంపిన కర్కశ కుమారుడు

By

Published : Oct 11, 2020, 11:59 AM IST

విశాఖపట్నం శ్రీహరిపురంలో నివాసముంటున్న కాళిబట్ల లక్ష్మి(76) భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లయి అత్తవారింట్లో ఉంటోంది. కుమారుడు చక్రవర్తి ప్రవర్తన సరిగ్గా లేకపోవటంతో అతడిని భార్య వదిలేసింది. దీంతో తల్లీకొడుకులు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన చక్రవర్తి డబ్బు కోసం తల్లిని వేధించసాగాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆమె కంచరపాలెంలోని వృద్ధాశ్రమంలో చేరింది. మూడేళ్లుగా అక్కడే ఉంటూ తనకు వచ్చే వృద్ధాప్య పింఛను డబ్బులను దాచిపెట్టుకుంది.

ఇదిలా ఉండగా.. తల్లి దగ్గర డబ్బులు ఉన్నట్లు చక్రవర్తి పసిగట్టాడు. ఎలాగైనా వాటిని తీసుకోవాలని అనుకున్నాడు. ఈనెల 1వ తేదీన వృద్ధాశ్రమానికి వెళ్లాడు. బిడ్డ తనను చూడ్డానికి వచ్చాడని ఆ తల్లి సంబరపడింది. మద్యం మానేశానని, విజయవాడలో పని దొరికిందని, అక్కడికి వెళ్లి బతుకుదామని చెప్పి తల్లిని వృద్ధాశ్రమం నుంచి తీసుకువచ్చాడు. విశాఖ రైల్వే స్టేషన్ సమీంపలోని ఓ లాడ్జిలో ఉంచాడు. ఈనెల 6వ తేదీన తనకు డబ్బులు కావాలని తల్లిని అడిగాడు. ఆమె ఇవ్వకపోవటంతో మద్యం మత్తులో ఉన్న చక్రవర్తి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం డబ్బులు తీసుకుని గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు.

అర్ధరాత్రి పూటుగా మద్యం తాగి మళ్లీ గదికి వచ్చి పడిపోయాడు. తెల్లవారాక లాడ్జి సిబ్బంది అతడిని లేపి అడగ్గా.. మా అమ్మ లోపల గడియ పెట్టుకుని తెరవడం లేదని చెప్పాడు. దీంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. తనకేమీ తెలియదని.. తాను బయటకు వెళ్లి వచ్చేసరికి తల్లి చనిపోయి ఉందని చక్రవర్తి పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

పది రోజుల్లోనే క్వింటాలుకు రూ.3వేల వరకు కోత

ABOUT THE AUTHOR

...view details