విశాఖకు చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఆంజనేయశర్మ ప్లాంట్‌లో డీజీఎం హోదాలో పనిచేస్తున్నారు. తనకున్న ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో పర్యావరణహితంగా ఓ కుక్కర్‌ను తయారు చేశారు. సౌరశక్తిని వినియోగించే దిశగా చేసిన పరిశోధనల ఫలితాన్ని మేథో హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఆంజనేయశర్మ తయారు చేసిన సౌర కుక్కర్ పేటెంట్ సాధించింది. సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే అంశానికి కొత్తదనాన్ని జోడిస్తూ తయారు చేసిన సౌర కుక్కర్ ఆకట్టుకుంటోంది.
సూర్య వెలుగుల్ని ప్రతిబింబిస్తున్న ఈ అద్దాల వరుస వెనుక పదేళ్ల శ్రమ ఉంది. ఆంజనేయశర్మ తయారు చేసిన పారాబొలిక్ సోలార్ కుక్కర్ నమూనా ఇది. విభిన్న దశల్లో జరిపిన పరిశోధనల అనంతరం ఇప్పుడు మనం చూస్తున్న ఈ సోలార్ కుక్కర్ తయారైంది. ఎండలో అద్దాలను ఉంచి వాటి ద్వారా కాంతి కిరణాలను ఒక ప్రదేశంపైకి పరావర్తనం చెందేలా చేయడం ద్వారా అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో థర్మల్ ఇన్సులేటెడ్ పెట్టెను వినియోగిస్తున్నారు. పెట్టెలో ఎక్రిలిక్ సిలికాన్ పూత పూయడం ద్వారా గిన్నెలో ఉంచిన ఆహార పదార్థాలు ఉష్ణ శక్తిని గ్రహించి పెట్టెలోని పదార్థాన్ని ఉడికిన ఆహారంగా మారుస్తోంది.