విశాఖ జిల్లాలోని సీలేరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ, అటవీ, ఏపీ జెన్‌కో అధికారులు శాండికోరి వద్ద పరిశీలించారు. సీలేరులో 950 మెగావాట్ల సామర్థ్యం గల ఎత్తిపోతల ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన సర్వే పనులను వ్యాప్‌కోస్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఆ సంస్థ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో స్థల సేకరణ కోసం జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలని స్థానిక జెన్‌కో అధికారులకు విద్యుత్ సౌదా నుంచి ఆదేశాలు అందాయి.
జెన్‌కో అధికారులు జిల్లా కలెక్టరును కలిసి ప్రాజెక్టు వివరాలను సమర్పించారు. దీంతో జిల్లా కలెక్టర్ సీలేరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమైన 214.15 హెక్టార్ల అటవీ భూమి, 115 హెక్టార్ల రెవెన్యూ భూముల స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రెవెన్యూ, అటవీ, జెన్‌కో అధికారులు శాండికోరి నుంచి సర్వే ప్రారంభించారు.