శోభానాయుడు కూచిపూడి నృత్యంలో.. గురువును మించిన శిష్యురాలిగా ఎదిగారు. పన్నెండేళ్ల వయసులోనే రంగస్థలంపై అరంగేట్రం చేసిన ఆమె... ఐదు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యమే శ్వాసగా జీవించారు. నాట్యమంటే కేవలం అభినయం కాదు.... జీవం ఉండాలని తరచూ చెప్పే శోభానాయుడు... కూచిపూడిని సరికొత్తగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించేవారు. శ్రీకృష్ణ పారిజాతం, జగదానందకారక, కళ్యాణ శ్రీనివాసం, శ్రీకృష్ణ శరణం మమ.. విజయోస్తుతే నారీ, క్షీరసాగర మదనం, విప్రనారాయణ, నృత్యరూపకాలతో పాటు., చండాలిక, సర్వం సాయిమయం, నవరస నటభామిని వంటి నృత్యనాటకాలతో ఆకట్టుకున్నారు..! శోభానాయుడు నృత్యరూపకాల్లో సత్యభామ, చండాలిక, దేవదేవకి, పద్మావతి, మోహిని...., సాయిబాబా, పార్వతి పాత్రలు ఆమెకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయి..
విశాఖ జిల్లా అనకాపల్లిలో కట్టా వెంకటనాయుడు, సరోజినీ దేవి దంపతులకు శోభానాయుడు 1956లో జన్మించారు. రేడియోలో పాటలు వింటూ శోభానాయుడు నాట్యం చేయడం గమనించిన సరోజినీదేవి... తన కుమార్తెను నృత్యకారిణిగా చేయాలని సంకల్పించారు. అయితే ఇంట్లో ఎవరూ సంగీతాన్ని తప్ప నాట్యాన్ని అభిమానించేవారు కారు. అందువల్ల.. ఎలాగైనా తన కుమార్తెకు నాట్యం నేర్పించాలని.... రాజమహేంద్రవరంలోని కూచిపూడి నృత్యకారుడు టీఎల్ రెడ్డి దగ్గర చేర్పించారు. ఆరేళ్ల వయసులోనే.... తొలి ప్రదర్శన ఇచ్చారు. తండ్రికి ఉద్యోగరీత్యా బదిలీలతో కుమార్తె శిక్షణకు ఆటంకం కలగకూడదని.... సరోజినీదేవి చెన్నై తీసుకెళ్లి ప్రముఖ నాట్యగురువు వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేర్పారు. అద్దె ఇంట్లో ఉంటూ..... కుమార్తెకు కూచిపూడి నేర్పించారు. అలా పన్నెండేళ్ల వయస్సులో... కూచిపూడి నృత్యంలో అరంగేట్రం చేసిన శోభానాయుడు దేశం గర్వించేలా ఎదిగారు.
సత్యభామ, పద్మావతి, చండాలిక, కృష్ణుడి పాత్రల్లో.... ఒదిగిపోయే శోభానాయుడు.., కూచిపూడి నృత్యంతో.... ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసేవారు. సత్యభామ పాత్ర వేయాలంటే శోభానాయుడుకు ఎంతో ఇష్టం..! అలా..., కూచిపూడి కళాకారిణిగా రాణిస్తున్న శోభానాయుడును కేంద్రం కూచిపూడి ప్రచారకర్తగా నియమించింది. కూచిపూడికి సమకాలీన అంశాలు జోడించి.... ప్రదర్శనలు ఇచ్చేవారు. ఎనభైకి పైగా నృత్య ప్రదర్శనలు... 16 నృత్య నాటకాలు ప్రదర్శించిన శోభానాయుడు.... యూకే, సిరియా, టర్కీ, హాంకాంగ్, మెక్సికో, వెనిజులా, క్యూబా వంటి దేశాల్లో కూచిపూడి నాట్య విశిష్టత చాటారు.