ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొమ్మి లింగం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 1600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారాను తయారు చేయటం, అమ్మటం నేరమని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబీ అధికారులు హెచ్చరించారు. ఈ దాడుల్లో సెబ్ అధికారులు ఎస్ఐ నగేష్, సిబ్బంది నాగూర్, శ్రీపతి, సుబ్బరాయుడు. పాల్గొన్నారు.
ఏరులై పారుతున్న నాటుసారా.. పుట్టగొడుగుల్లా స్థావరాలు..
విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లోని నాటుసారా ఎక్కువ మొత్తంలో తయారవుతోంది. మద్యం ధరలు పెరగటం.. కరోనా ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఆదాయాలు తగ్గడంతో.. తక్కువ ధరకు లభించే నాటుసారా వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అక్రమార్కులకు నాటుసారా తయారీ కుటీర పరిశ్రమగా మారిపోయింది. సారా తయారీ దారులకు కొందరు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2 వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం..
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊట, సారా పట్టుబడుతోంది. దేవరాపల్లి మండలం బొడ్డపాడు, ముకందపురం ప్రాంతాల్లో నాటుసారా తయారు చేస్తున్నట్లు అందిన సమాచారంతో.. పోలీసులు దాడులు నిర్వహించారు. 2వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీ సామాగ్రి, ప్లాస్టిక్ డ్రమ్ములను కాల్చివేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సింహాచలం తెలిపారు.