ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తూర్పుగోదావరి, శ్రీకాకుళం మధ్య చీలిక గుర్తింపు - బంగాళాఖాతం

విశాఖ సహా ఉత్తరాంధ్రలోని తీరప్రాంతానికి భవిష్యత్తులో సునామీ, భూకంపం వంటి భారీ విపత్తుల ముప్పు ఉందని తాజా పరిశోధనలో తేలింది. కృష్ణా-గోదావరి బేసిన్‌లో పొడవైన పడవ వంటి పగుళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భవిష్యత్‌లో ఈ ఫ్రాక్టర్‌ లైన్‌కు ఏదో ఒకవైపు ఒత్తిడి పెరిగితే... భారీ చీలిక ఏర్పడి విపత్తులు తలెత్తవచ్చునని ఓ అధ్యయనం వెల్లడించింది. తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీరం పొడవునా ఉన్న ఈ చీలిక ఎలా ఏర్పడింది? దాని పర్యవసానాలేమిటి? ముప్పును ఎలా ఎదుర్కోవచ్చనే అంశాలపై శాస్త్రవేత్తల బృందం తదుపరి అధ్యయనం కొనసాగిస్తోంది.

east coastal areas
east coastal areas

By

Published : Jul 20, 2020, 4:27 AM IST

Updated : Jul 20, 2020, 5:18 AM IST

తూర్పు తీర ప్రాంతంలో సముద్రం లోపల భారీ పగుళ్లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల ఉత్తర కోస్తా ప్రాంతానికి భవిష్యత్తులో సునామీ, భూకంప ప్రమాదాలు పొంచి ఉన్నాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. సముద్రం లోపల రాళ్ల కదలికలు.. భూకంపాల మధ్య సంబంధాలపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కె.ఎస్ కృష్ణ, జాతీయ సముద్ర అధ్యయన సంస్థకు చెందిన కె.శ్రీనివాస్, ఓఎన్​జీసీకి చెందిన సాహాతో కూడిన శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. కొన్నేళ్లుగా సాగుతున్న వారి పరిశోధనకు సంబంధించిన పత్రం.... తాజాగా ఇండియన్‌ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ ఆధ్వర్యంలో జర్నల్‌ ఆఫ్‌ ఎర్త్‌ సిస్టం సైన్స్‌లో ప్రచురితమైంది.

బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల పొడవైన పడవ లాంటి పగుళ్లు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. తీర ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఇవి ఉన్నట్లు గుర్తించారు. భవిష్యత్తులో ఈ పగుళ్లకు ఏదో ఒకవైపు ఒత్తిడి పెరిగితే.. భారీ చీలిక ఏర్పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాణహిత-గోదావరి గ్రాబెన్‌ నుంచి.... నాగావళి-వంశధార షియర్‌ జోన్‌ వరకు... సుమారు 300 కిలోమీటర్ల దూరం భూమి చీలినట్లు తేల్చారు. అందులోని రాళ్లు, మట్టి నమూనాల ఆధారంగా కోటీ 60 లక్షల సంవత్సరాల కిందటే చీలిక ఏర్పడిందని గుర్తించారు. 68 లక్షల సంవత్సరాల నుంచి 3 లక్షల ఏళ్ల కిందటి వరకు ఆ చీలిక ప్రాంతంలో అలజడి కొనసాగుతూనే ఉందని తేల్చారు. ఈ మధ్యకాలంలోనే భూకంపాలు, సునామీలు వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు. అప్పటి నుంచి నేటి వరకు చీలిక వల్ల దుష్పరిణామాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించలేదు. చీలికలోకి చేరిన పూడికపై కొత్తగా వచ్చి చేరిన రాళ్లు, ఇసుక వల్ల క్రమంగా ఒత్తిడి పెరుగుతోందని, ఫలితంగా మళ్లీ భూకంపం వచ్చి అది సునామీకి దారితీయొచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

నదుల నుంచి సముద్రంలోకి నీటితోపాటు మట్టి, రాళ్లు, ఇతర వ్యర్థాలు చేరుతుంటాయి. కొన్ని లక్షల సంవత్సరాలుగా జరిగే ఈ ప్రక్రియ వల్ల లక్షల టన్నుల అదనపు భారం సముద్రగర్భంపై పడి ఒత్తిడి క్రమంగా పెరుగుతూ వచ్చింది. నదుల నుంచి కొట్టుకొచ్టిన రాళ్లు, మట్టి వల్ల సముద్రంలో 22 కిలోమీటర్ల ఎత్తున మేటలు పడ్డాయి. ఒత్తిడి తారస్థాయికి చేరాక... భారాన్ని భరించలేక సముద్రగర్భంలో భూమి కంపించి....సముద్రగర్భంలో చీలిక ఏర్పడినపుడు తీరంవైపు భూభాగం కుంగిపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.. అత్యధికంగా 900 మీటర్ల వరకు కుంగినట్లు ఆధారాలున్నాయని చెబుతున్నారు.

విశాఖ తీరానికి సమీపంలో కుంగుబాటు ఎక్కువగా ఉందని... దాని పర్యవసానాలు... నగరంపై పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చీలిక కారణంగా భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ప్రాంతానికి భూకంపాలు, సునామీల ముప్పు పొంచి ఉందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. చీలిక భాగం తీరానికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్న నేపథ్యంలో ముప్పు తీవ్రత ఎక్కువగానే ఉండొచ్చని చెబుతున్నారు. కానీ అది ఎప్పుడన్నదీ స్పష్టంగా చెప్పలేమన్నారు శాస్త్రవేత్తలు.

ఇదీ చదవండి:

నిమ్మగడ్డ వ్యవహారం... సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్

Last Updated : Jul 20, 2020, 5:18 AM IST

ABOUT THE AUTHOR

...view details