విశాఖ జిల్లాలో నర్సీపట్నం మున్సిపాలిటీ పాలకవర్గం సమయం గత ఏడాదే పూర్తయింది. మేజర్ పంచాయతీగా ఉన్న నర్సీపట్నం.. ఆరేళ్ల క్రితం మున్సిపాలిటీగా మారింది. ఈ నేపథ్యంలో తొలి చైర్ పర్సన్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడి సతీమణి అనిత ఎన్నికయ్యారు. అప్పట్లో 27 వార్డులకు సంబంధించి 20కి పైగా స్థానాలను తెదేపా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఎన్నికలకు కొత్తగా మరో వార్డు రావడంతో వార్డుల సంఖ్య 28కి చేరింది.
చైర్ పర్సన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయింపు:
ప్రస్తుతం మునిసిపాలిటీ జనాభా 67 వేలకు పైగా ఉండగా.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 47 వేల 383 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఈ దఫా పురపాలిక ఎన్నికల్లో చైర్ పర్సన్ పదవిని ఎస్సీ మహిళలకు కేటాయించడంతో.. అధికార పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రతిపక్ష పార్టీ నుంచి మాజీ మంత్రి తెదేపా సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు వర్గాలు ప్రముఖంగా పోటీపడుతున్నాయి.
వసతులలేమి వెంటాడుతూనే ఉంది:
మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ స్థాయికి ఎదిగిన నర్సీపట్నం.. రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా పేరు పొందడంతో పాటు విశాఖ మన్యానికి ముఖద్వారంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వ్యాపార వాణిజ్య పరంగా నర్సీపట్నం రోజురోజుకూ విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పట్టణాన్ని నివాసయోగ్యంగా తీర్చిదిద్దుతున్నారు. మున్సిపాలిటీ స్థాయికి నర్సీపట్నం ఎదిగినప్పటికీ తాగునీరు, రహదారుల సదుపాయం, పారిశుద్ధ్యం విషయాల్లో వెనుకబడే ఉందని అక్కడి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.