ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కన్న తల్లిలాంటి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకుంటాం' - రైతు, కార్మిక శంఖారావ సభ తాజా వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామంటే చూస్తూ ఉరుకోబోమని ఉక్కు శంఖారావం సభ సాక్షిగా కార్మికలోకం గర్జించింది. ప్రభుత్వరంగ సంస్థలంటే ప్రజల సంపదని.. దీన్ని పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని..కార్మిక, రైతు సంఘాల నాయకులు విమర్శించారు. ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ స్ఫూర్తితో పోరాడుతామని.. కన్నతల్లిలాంటి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకుంటామని ముక్తకంఠంతో నినదించారు.

rythu shankaravam  meeting over vishaka steel
రైతు శంఖారావం సభ

By

Published : Apr 18, 2021, 6:19 PM IST

Updated : Apr 18, 2021, 8:51 PM IST

కన్న తల్లిలాంటి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకుంటాం

విశాఖ ఉక్కు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు, కార్మికులు శంఖారావం పూరించారు. విశాఖ వేదికగా జరిగిన ఈ సభకు జాతీయ రైతు సంఘం నాయకుడు రాకేష్ సింగ్‌ టికాయత్‌, ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ నాయకుడు అశోక్ దావల, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతోపాటు.. స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. రాకేశ్‌ టికాయత్‌ శంఖం ఊది సభను ప్రారంభించారు. జోరువానలోనూ సభను కొనసాగించారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఎంతవరకైనా పోరాడాలని కార్మికులకు టికాయత్‌ పిలుపునిచ్చారు.

ప్రజల సంపదైన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను.. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కొత్త సాగు చట్టాలకు ప్రజామోదం లేదన్నారు. అయినా ముందుకెళ్లాలనుకుంటే..పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని మోదీకి సూచించారు.

ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం తప్పితే.. కొత్త కర్మాగారాలు ఏం తెచ్చారని ఆలిండియా కిసాన్‌ సభ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భాజపా ప్రభుత్వం నీరు నింగి నేలను కూడా అమ్మేస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ను అమ్మేస్తామంటే కార్మిక లోకం చూస్తూ ఉరుకోబోదని..దిల్లీలో రైతు ఉద్యమం తరహాలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం జరుగుతుందని చెప్పారు. కేంద్ర అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకెళ్దామని కిసాన్‌ సభ నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు ఇవ్వాలని అడిగినా ఇవ్వడం లేదని స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తల్లి లాంటి స్టీల్‌ప్లాంట్ అమ్మేస్తామంటే ఊరుకోబోమని తేల్చిచెప్పారు.

అంతకుమందు కార్మిక శంఖారావ సభ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పార్క్ హోటల్ నుంచి ఉద్యమకారులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించాలని భావించగా...పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా కొద్దిమంది నాయకులు, ఉద్యమకారులు కాలి నడకన శంఖారావ సభకు చేరుకున్నారు.

ఇదీచదవండి

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి: టికాయత్

Last Updated : Apr 18, 2021, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details