విశాఖలో పర్యాటకులను అమితంగా అలరించే రుషికొండ బీచ్ అంతర్జాతీయ స్థాయిని అందుకొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలు నెలకొల్పే దిశలో రెండున్నరేళ్లుగా సాగిస్తున్న కృషి ఫలించిన వేళ.... బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను సొంతం చేసుకొంది. ఇందుకు సంబంధించిన అంతర్జాతీయ జ్యూరీ మన దేశంలో రుషికొండ సహా మరో 8 బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే లాంఛనంగా రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ ఎగరవేయనున్నారు.
ప్రధాని మోదీ చొరవ...
పర్యాటక రంగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందువల్లనే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ మన దేశంలోని పలు సాగర తీరాలను బ్లూ ఫ్లాగ్ స్థాయికి అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆకర్షణీయ అంశాలున్న బీచ్‌లను ఎంపిక చేసి ప్రత్యేక నిధితో అభివృద్ధి చేసేలా బీమ్స్ ప్రాజెక్టును పర్యావరణ మంత్రిత్వ శాఖ మూడేళ్లుగా అమలు చేసింది. 4 ప్రధాన అంశాలకు ప్రాధాన్యమిస్తూ 33ప్రమాణాలను నిర్దేశించుకుని రుషికొండ బీచ్‌ను పర్యావరణ హితంగా అభివృద్ధి చేశారు. ఆ కృషి ఫలించి ఎట్టకేలకు నీలి జెండా రెపరెపలు కనువిందు చేయనున్నాయి.