విశాఖలో కరోనా వ్యాప్తి నివారణకు ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశం అయింది. డిప్యూటీ సీఎం, వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా విశాఖలో రైతుబజార్లును పెద్ద మైదానాలలో ఏర్పాటు చేయడం, నగరంలోనే ఒక కరోనా నిర్ధరణ వైద్య పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి నివారణకు ఏర్పాటు చేసిన 20 జిల్లా కమిటీల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సహకరించకపోతే చట్టపరంగా చర్యలు:ఆళ్ల నాని
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవాళ్లు అధికారులకు సహకరించాలని.. లేకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. కరోనా నివారణకు విశాఖ జిల్లాలో 20 కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మంగళవారం విశాఖలో మరో ఇద్దరు మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. నగరంలోని సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి ప్రాంతాలను హైరిస్క్ జోన్లగా గుర్తించినట్లు ఆయన వివరించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలకు చేపడుతున్నామన్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1470 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. కరోనా నివారణపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.