ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను రద్దు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ - ఏపీ తాజా వార్తలు
13:04 March 30
విశాఖ ఉక్కుపై హైకోర్టులో ఐపీఎస్ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ పిల్
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించి.. రద్దుచేయాలని హైకోర్టును ‘జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్’ ఛైర్మన్, విశ్రాంత ఐపీఎస్ అధికారి (సీబీఐ మాజీ జేడీ) వీవీ లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ కమిటీ ఈ ఏడాది జనవరి 27న తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. ఈ విషయంలో తదుపరి చర్యలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. కర్మాగారానికి ఇనుప ఖనిజం గనుల కేటాయింపు విషయంలో సాధ్యాసాధ్యాల పరిశీలనకు రికార్డులు తెప్పించి పరిశీలించాలని కోరారు. కేంద్ర ఆర్థిక, ఉక్కు, గనుల శాఖల కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్‌ఐఎన్‌ఎల్ ఛైర్మన్, విశాఖ జిల్లా కలెక్టర్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
భూముల విలువను తక్కువగా చూపారు
‘విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 22వేల ఎకరాలు సేకరించారు. 16,850 మంది పేద రైతులు భూముల్ని కోల్పోయారు. వారికి ఎకరాకు కేవలం రూ.1,270 పరిహారం చెల్లించారు. భూములిచ్చిన కుటుంబాల్లో ఇంకా కొందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. 5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కర్మాగారంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం చాలామందిని నిరాశకు గురిచేసింది. విశాఖ వాసులే కాకుండా తెలుగు ప్రజలు ఈ వ్యవహారంపై ఉద్యమిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ బలోపేతానికి రెండు మార్గాల్ని చూపుతూ ప్రధానికి రెండు లేఖలు రాశాను. ఆర్థిక సంక్షోభం, మార్కెట్ లేకపోవడం, ఉక్కుకు తక్కువ డిమాండ్, అధిక ధరకు ఇనుపఖనిజం కొనుగోలు వల్ల నష్టం వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. ముడి ఖనిజం కోసం గనులు కేటాయించాలి. కర్మాగారాన్ని లాభాలబాట పట్టించొచ్చని ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. క్యాబినెట్ కమిటీ నిర్ణయం కేవలం కార్యనిర్వాహక చర్య. దానికి చట్టపరమైన ఆధారం లేదు. పలువురి జీవనోపాధికి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని న్యాయస్థానం రద్దు చేయవచ్చు. ప్రైవేటీకరణ రాజ్యాంగపీఠికకు విరుద్ధం. ప్రభుత్వరంగ సంస్థలను లాభసాటి సంస్థలుగా పరిగణించకూడదు. విశాఖ ఉక్కు భూముల విలువను బ్యాలెన్స్‌షీట్‌లో రూ.55.82 కోట్లేనని చూపించారు. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.60వేల కోట్లు. తక్కువ విలువ చూపిస్తే ఆ భూమి స్థిరాస్తి వ్యాపారుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఏపీ విభజన చట్టంలో చెప్పినట్లుగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోకపోగా.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది. ఉపాధి అవకాశాలు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే చాలామంది ఉపాధి కోల్పోతారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు అమలుకాక.. సామాజిక న్యాయం జరగదు. ప్రైవేటు వ్యక్తులు లాభాలు రాకపోతే కర్మాగారాల్ని మూసివేసి భూముల్ని విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దుచేయండి’ అని వ్యాజ్యంలో కోరారు.
ఇదీ చదవండి:'కేరళలో ఆ రెండు కూటముల మ్యాచ్ ఫిక్సింగ్'