ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో 'రెమ్​డెసివిర్​' బ్లాక్​లో విక్రయం..పలువురు అరెస్ట్​

కరోనా రోగులకు ఇచ్చే రెమిడెసివిర్ ను పక్కదారి పట్టిస్తున్న కొందరిని విశాఖలో విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక్కో ఇంజక్షన్‌ను బ్లాక్​లో రూ.10 వేలకు విక్రయిస్తున్న వారిని పట్టుకున్నారు. వీరికి ఇంజక్షన్లు ఎలా లభిస్తున్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు.

vizilance raids at omni rk hospital at vizag
విశాఖ ఓమ్ని ఆర్కేలో రెమిడిసివిర్ పక్కదారి పట్టిస్తున్న సిబ్బంది

By

Published : Apr 19, 2021, 10:34 PM IST

Updated : Apr 20, 2021, 5:35 AM IST

కరోనా రోగుల కోసం కొనుగోలు చేసిన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను వారికి ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో రాసేసి, బ్లాక్‌మార్కెట్‌లో అమ్మేసుకుంటున్న వైద్యసిబ్బంది బాగోతమిది. కరోనా చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పక్కదారి పట్టిస్తున్న ముగ్గురు నర్సులు, ఇద్దరు హౌస్‌కీపింగ్‌ ఉద్యోగుల అక్రమాల గుట్టును విశాఖ విజిలెన్స్‌ అధికారులు రట్టు చేశారు. నగరంలోని రామ్‌నగర్‌లో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలోని నర్సులు ఈ మోసానికి పాల్పడుతున్నారని పక్కా సమాచారం అందడంతో ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారిణి (ఆర్వీవో) జి.స్వరూపరాణి అప్రమత్తమయ్యారు.

సోమవారం రాత్రి ఆర్వీవో ఆధ్వర్యంలో విజిలెన్స్‌ అధికారులు రోగుల బంధువుల్లా ఆసుపత్రి మందుల దుకాణం దగ్గరకు వెళ్లి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కావాలని అడిగారు. దుకాణం బయట ఉన్న వ్యక్తి అనధికారికంగా ఆ ఇంజక్షన్‌ను విక్రయించడంతో వారి గుట్టు రట్టైంది. నిందితులను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ రెమ్‌డెసివిర్‌ ఉపయోగించాల్సిన వ్యక్తులకు ఇంజక్షన్లు చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో రాసుకుని వాటిని బ్లాక్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు వారు అంగీకరించారు. ఇలా ఏడు ఇంజక్షన్లు అనధికారికంగా ఇచ్చినట్లు నిర్ధారించారు. ఈ ఇంజక్షన్‌ ధర రూ.5,400కాగా.. సిబ్బంది వాటిని రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యానికి తెలియకుండా కిందిస్థాయి సిబ్బంది ఈ నిర్వాకానికి పాల్పడినట్లు తేల్చారు. నిందితులను పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారని ఆర్వీవో స్వరూపరాణి పేర్కొన్నారు.

Last Updated : Apr 20, 2021, 5:35 AM IST

ABOUT THE AUTHOR

...view details