జనావాసాల మధ్య ఉన్న హానికారక పరిశ్రమలను దూరంగా తరలించే విషయంలో విధానపరమైన ఆలోచన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. విశాఖలో ఇలాంటి పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని చెప్పారు. విశాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ వస్తున్నారని, ఈ ఘటనపై సమగ్ర విచారణతో పాటు.. కార్యాచరణ ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశించారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన విశాఖ విషవాయు ఘటనపై వీడియోకాన్ఫరెన్సులో సమీక్షించారు. విశాఖలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, కలెక్టర్ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్ ఆర్‌కె మీనా తదితరులు పాల్గొన్నారు. కాలుష్య కారక అంశాలు, వాటి నివారణ, ప్రామాణిక నిర్వహణ విధానాల వివరాలను సిద్ధం చేయాలని వారికి సీఎం చెప్పారు. విశాఖలో పరిస్థితి అదుపులో ఉందని సీఎస్ నీలం సాహ్ని వివరించారు. ట్యాంకరులోని రసాయనంలో 60% పాలిమరైజ్ అయిందని, మిగిలింది కావడానికి 18-24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారన్నారు.