రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకర రీతిలో కొనసాగుతోంది. నిన్న, మొన్నటి వరకు ఐదారు వేల లోపే నమోదైన కేసులు..ఇవాళ పదివేలకు ఎగబాకాయి. సంక్రాంతి వేడుకలు, ప్రయాణీకుల రద్దీ, గుంపులుగా సంచరించడం వంటి కారణాలతో కొవిడ్ కేసులు పెరిగినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 41,713 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా...10,057 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా మరో 8 మంది మృతి చెందారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,827, చిత్తూరు జిల్లాలో 1,822, గుంటూరు జిల్లాలో 943, తూర్పుగోదావరి జిల్లాలో 919, అనంతపురం జిల్లాలో 861, ప్రకాశం జిల్లాలో 716, కడప జిల్లాలో 482 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కొవిడ్ నుంచి మరో 1,222 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,935 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. 2,82,970 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 441 మంది మరణించారు. 1,88,157 మంది కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం మరణాలు:4,87,202
- యాక్టివ్ కేసులు:18,31,000
- మొత్తం కోలుకున్నవారు:3,55,83,039