విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఎనిమిదో ప్లాట్‌ఫామ్ వైపు ఉన్న జ్ఞానాపురం వైపు రైల్వే స్థలాల్లోని కొంత భూమిలో వాణిజ్య అవసరాల కోసం ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ బాధ్యతను రైల్వే ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ)కు అప్పగించారు. రైల్వేస్టేషన్ బయట ఉన్న భూముల్ని ఏ విధంగా వినియోగించాలనే అంశంపై ప్రస్తుతం ఆ సంస్థ డిజైన్లను రూపొందిస్తోంది. రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రైవేటు సంస్థకు బాధ్యతలు
విశాఖ రైల్వేస్టేషన్ పరిసరాలను వాణిజ్య అవసరాల కోసం కేటాయించేందుకు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైంది. 2017లోనే ఈ ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. అప్పట్లో లీజు వ్యవహారంలో గుత్తేదార్లకు, రైల్వే అధికారుల మధ్య సఖ్యత కుదరలేదు. దీంతో ప్రాజెక్టు మరుగునపడింది. అనంతరం ఈ బాధ్యతను ఆర్‌ఎల్‌డీఏ తీసుకుంది. ప్రైవేటు సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించి, లీజుకు ఇవ్వడంతో పాటు వారే నిర్వహించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.