గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలోని డీవీసీ వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు వైద్యశాల ఎండీ ధూళిపాళ్ళ జ్యోతిర్మయి తెలిపారు. రేపల్లె ప్రాంతానికి చెందిన గీత కార్మికులు పోతురాజుకి కుడి వైపు మెడ కింద కణిత ఏర్పడడంతో ఓ ప్రైవేటు వైద్యశాలలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అది విజయవంతం కాలేదు. పోతురాజు... వైద్యశాల ఛైర్మన్ నరేంద్ర కుమార్ని కలవడంతో డీవీసీ ట్రస్టు తరఫున శస్త్ర చికిత్స చేసేందుకు అవకాశం కల్పించారు. వైద్యులు గౌరీ శంకర్ అతని మిత్ర బృందం 11 గంటల పాటు శ్రమించి మోకాలి కింది భాగంలోని ఎముకను తీసి దవడ భాగంలో అమర్చి శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు.
పది గంటలు పట్టేది...పది నిమిషాల్లో చేశారు
రక్తపు వాంతులు, రక్తపు విరోచనాలతో బాధపడుతున్న రోగికి గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వైద్యులు మళ్లీ ప్రాణం పోశారు. అరుదైన వైద్యచికిత్సను ఉచితంగానే చేపట్టి పేదకుటుంబానికి ఉపశమనం కల్గించారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం విస్సన్నపేటకు చెందిన జమలయ్యకు కొంతకాలంగా రక్తపు వాంతులు..విరోచనాలతో బాధపడుతున్నాడు. ప్రైవేటు ఆస్పత్రులకు తిప్పి లాభం లేదనుకుని ఈ నెల 17న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షలు చేసి క్లోమగ్రంధి వాపు జబ్బుగా గుర్తించారు. లోపల రక్తనాళాలు ఉబ్బి రక్తస్రావమవుతుందని గమనించి కేసును ఉదరకోశ విభాగానికి పంపించారు. ఆ విభాగాధిపతి డాక్టర్ కవిత, సహ విభాగాధిపతి డాక్టర్ షేక్ నాగూర్ బాషా పరీక్షలు చేశారు. ఈ నెల 23న రోగికి మత్తు ఇచ్చి ఎండోస్కోపిక్ ఆల్ట్రాసౌండ్ ద్వారా గ్యాస్ట్రోడ్యూయెడనల్ ఆర్టరీ సూడో ఇన్యోరెజిమ్లోకి ఇంజక్షన్ ఇచ్చిన వైద్యులు... రోగి రక్త స్రావ సమస్యను తగ్గించారు. ఈ ఆపరేషన్ చేయాలంటే గతంలో దాదాపు పది గంటల సమయం పట్టేది. వైద్య రంగంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం 10 నిమిషాల్లో వైద్యులు శస్త్రచికిత్స చేసి రోగిని కాపాడారు. ఈ వైద్యం చేయాలంటే ప్రైవేట్ ఆసుపత్రిలో కనీసం రెండు లక్షలు అవుతుండగా.... కోస్తాంధ్ర ఆరోగ్య ప్రదాయని జీజీహెచ్లో ఈ ఆపరేషన్ను ఉచితంగానే నిర్వహించారు. డాక్టర్ కవిత బృందానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందనలు తెలిపారు.